thummala
తెలంగాణ రాజకీయం

తుమ్మల నాగేశ్వర రావు దారెటు..! కాంగ్రెస్సా.. బీజేపీనా..!

తుమ్మల నాగేశ్వర రావు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత. సుదీర్ఘకాలంపాటు తుమ్మల టీడీపీలో ఉన్నారు. సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వర రావు టీడీపీలో కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే సీఎం కేసీఆర్ 2014లో తుమ్మల నాగేశ్వరరావును అప్పటి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత తుమ్మలకు ఎమ్మెల్సీ చేసి ఆర్అండ బీ, స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2016లో జరిగిన పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై గెలిచారు.

2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించారు. కానీ సీఎం కేసీఆర్ తుమ్మలకు నాగేశ్వరరావు టికెట్ కేటాయించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో తుమ్మల నాగేశ్వర రావు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

టికెట్ రాకపోవడంపై తుమ్మల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో నాలుగు మండలాల తుమ్మల అనుచరులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తుమ్మలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన నుంచి తుమ్మలకు ఇబ్బందిగా మారింది. తాజా తుమ్మలకు టికెట్ కూడా రాకపోవడంతో ఆయన ఏం చేస్తారో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ లో ఉన్నారు.

తుమ్మల నాగేశ్వర రావును కాంగ్రెస్ లో చేరాలని అనుచురులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల నాగేశ్వర రావు ఇష్టపడడం లేదని సమాచారం. తుమ్మల కేసీఆర్ హామీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ హామీ కోసం చివరి క్షణం వరకు వేచి ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తుమ్మలకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం భావిస్తున్నారు.