cm jagan
ఆంధ్రప్రదేశ్ జాతీయం

8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను 8 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 గ్రీన్‌ ఎనర్జీ విషయంలో దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆదర్శంగా నిలుస్తుంద‌ని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని.. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులతో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. బుధవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేప‌ల్లిలోని తన క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. 

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అవుకు మండలంలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 2300 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ప్రాజెక్టు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎంగ్రీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 700 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 300 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టు, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్‌ మండల కేంద్రంలో ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు ఫౌండేషన్‌ స్టోన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

గ్రీన్‌కో ఎనర్జీకి సంబంధించి సౌర విద్యుత్‌ ప్రాజెక్టు దాదాపుగా రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రాజెక్టు ఇది అని తెలిపారు సీఎం జగన్. “ఈ ప్రాజెక్ట్‌ పిన్నాపురంలో ఉన్న పంప్‌ స్టోరేజీ. ఇది ఆర్టిఫిషియల్‌ ప్రాజెక్టు, పీక్‌ అవర్స్‌లో పవర్‌ను జనరేట్‌ చేసేందుకు నాచ్యురల్‌ ప్రాజెక్ట్‌గా తయారు చేస్తున్నాం. ఈ పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు వల్ల రేపు గ్రీన్‌ ఎనర్జీతో వపర్‌ జనరేట్‌ చేసేందుకు బొగ్గు ఉపయోగాన్ని తగ్గించి రాబోయే రోజుల్లో పంప్‌ స్టోరేజీ ప్రాజెక్టులు బాగా పని చేస్తాయి. పర్యావరణాన్ని రక్షిస్తూ అదే సమయంలో పవర్‌ జనరేట్‌కు గొప్ప గ్రీన్‌ ఎనర్జీ రెవల్యూషన్‌గా మారుతోంది..

ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ప్రతి మెగా వాట్‌ కూడా రాష్ట్రానికి దాదాపుగా మరో వంద సంవత్సరాలు రాయల్టీ కింద ప్రతి మెగా వాట్‌కు లక్ష చొప్పున ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం వల్ల జీఎస్టీ ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సహకరిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు లీజ్‌గా రూ.30 వేలు ఇస్తాం. ప్రతి రెండేళ్లకు ఒకసారి 5 శాతం ఎస్కలేషనల్‌లో పెంచుతారు. రాయలసీమ ప్రాంతంలో నీళ్లకు కటకటలాడే పరిస్థితి దశాబ్ధాలుగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు రావడం, ప్రతి ఏటా రూ.30 వేలు లీజ్‌ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్న ఉపాధి కాక, జీఎస్టీ ఆదాయమే కాకుండా రైతులకు లీజ్‌ రూపంలో రాష్ట్రానికి వస్తుంది. దీని వల్ల అన్ని రకాలుగా అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరిగే మంచి కార్యక్రమం ఇది. పర్యావరణానికి  మంచి చేసే కార్యక్రమం ఇది.. ” అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.