జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 28న నగరిలో సీఎం జగన్ బటన్ నొక్కనున్నారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా దీవెన మూడో త్రైమాసిక నిధులను సీఎం జగన్.. ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి నేరుగా విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా… ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ , ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులను తిరిగి చెల్లిస్తారు.
ఈ నెల 28న నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ కోర్సులను చదివే విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులను అందించే మరో పథకం కోసం రూ.14,912 కోట్లు ఖర్చు చేస్తుంది. జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena) పథకం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజుల మొత్తాన్ని విడతల వారీగా తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena ) పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో ఐటీడీ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఈ నెల 28న నగరిలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఈ సభ జరగనుంది.
మంత్రి రోజా నియోజకవర్గంలో
జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేసేందుకు చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నగరి సభలో సీఎం జగన్ బటన్ నొక్కి విద్యా దీవెన కింద నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా యంత్రాంగం చేస్తుంది. మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో సీఎం జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, అందులో భాగంగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేయనుండడంతో….ఈ సభను సక్సెస్ చేసేందుకు మంత్రి రోజా ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తు్న్నారు.