ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మాత్రం ఈ సమయంలో కొత్తగా ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి(Patnam Mahendar Reddy) మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం కేసీఆర్. మంత్రివర్గ విస్తరణలో ఆయన ఒక్కడికే స్థానం కల్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి. దీంతో అసలు ఆయనకు కేసీఆర్ అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు కొద్దిరోజుల ముందే బీఆర్ఎస్ లో చేరారు. గెలిచిన వెంటనే తెలంగాణ తొలి కేబినెట్ లో మంత్రి అయ్యారు.
అయితే 2018 ఎన్నికల్లో ఆయన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తరువాత కూడా బీఆర్ఎస్ లో కొనసాగుతూ వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి.. ఆ తరువాత ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో మహేందర్ రెడ్డికి విభేదాలు తీవ్రమయ్యాయి.
ఈ క్రమంలో ఈసారి తాండూరు టికెట్ తనకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయనను బుజ్జగించిన బీఆర్ఎస్ నాయకత్వం.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి.. తాండూరు టికెట్ ను పైలెట్ రోహిత్ రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే బీఆర్ఎస్ నాయకత్వం పట్నం మహేందర్ రెడ్డికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. ఆయన భార్య, కుమారుడు కూడా రాజకీయంగా పలు పదవుల్లో ఉన్నారు. ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయపరంగా బలమైన కుటుంబం కావడంతో.. ఆయనను వదులుకోవడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఏ మాత్రం సిద్ధపడలేదనే అభిప్రాయం కూడా ఉంది.
మరోవైపు పట్నం మహేందర్ రెడ్డిపై గెలిచిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వడం వెనుక కూడా ప్రత్యేకమైన కారణం ఉందనే వాదన ఉంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో విపక్షాలను టార్గెట్ చేసే విషయంలో పైలెట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ వదులుకోలేని పరిస్థితి ఏర్పడిందనే టాక్ ఉంది. ఈ రకంగా తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పైలెట్ రోహిత్ రెడ్డిని.. మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతృప్తి చెందేలా చేశారని పలువురు భావిస్తున్నారు.