revanth reddy
తెలంగాణ రాజకీయం

క్లారిటీ వచ్చేసింది... ఈసారి అక్కడ్నుంచే రేవంత్ రెడ్డి పోటీ

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రేసు గుర్రాల జాబితా ఇప్పుడిప్పుడే కొలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేసే సీటుపై క్లారిటీ వచ్చేసింది.

కొడంగల్… రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అత్యంత ఆసక్తికరంగా రాజకీయాలు జరిగే సీటు..! రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాగైనా ఈ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావించినా… 2014 లో వర్కౌట్ కాలేదు. కానీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అప్పట్లో ఈ ఫలితం అందరిలోనూ ఆసక్తిని రేపింది. కారణం.. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..! బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శించే రేవంత్ రెడ్డి… అనూహ్యంగా ఇక్కడ్నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లు అయింది. కట్ చేస్తే… మళ్లీ రేవంత్ రెడ్డి కొడంగల్ పై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదిపే పనిలో పడ్డారు. కీలక నేతలను కాంగ్రెస్ లోకి రప్పించే పనిలో పడ్డారు. అంతేకాదు ఆయన పోటీ చేసే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సీటు నుంచి పోటీ చేస్తారనే చర్చ ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తాను కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో గురువారం కాంగ్రెస్ నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కొడంగల్‌ను దత్తత తీసుకుంటానన్న సీఎం కెసిఆర్, కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని, నియోజకవర్గ నేతలు తన తరుపున స్థానిక నేతలు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేస్తారని రేవంత్ వెల్లడించారు. ఫలితంగా రేవంత్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చినట్లు అయింది.

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయినా రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీలోనే ఉంటే రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగే ఛాన్స్ లేదని భావించిన రేవంత్ రెడ్డి… 2017 అక్టోబర్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డిని… కేసీఆర్ తన అస్త్రాలన్నీ ఉపయోగించి ఓడించారు.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి… పాదయాత్రలు, పదునైన మాటలు, ప్రత్యర్థి వ్యూహాలను ఛేదిస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.