ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్‌తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు ఇంటింటి సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని 7,66,557 ఇండ్లలో 75,97,433 మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించింది.
అత్యధికంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 17,398 ఇండ్లలో 2,20,316 మంది, యాకుత్‌పురా నియోజకవర్గంలోని 14,883 ఇండ్లలో 1,84,060 మంది, రాజేంద్రనగర్ నియాజకవర్గంలోని 13,901 ఇండ్లలో 1,57,972 మంది, ఎల్బీనగర్ నియజకవర్గంలోని 13,987 ఇండ్లలో 1,48,378 మంది, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 10,649 ఇండ్లలో 1,06,336 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓటర్ కార్డులను మార్చుకునేందుకు, చిరునామా సవరణ, ఇతర మార్పుల కోసం ఫారం-8 ద్వారా ఇప్పటివరకు దాదాపు 9,00,115 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 25,026, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా సిద్దిపేటలో 18,148 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆగస్టు 26, 27న బూత్ స్థాయిలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్ల వయసు నిండేవారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు, సవరణలకు ఆన్‌లైన్‌లోనూ వెసులుబాటు కల్పించినట్టు తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల నమోదు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఆర్వో, ఈఆర్వోలతో ఓటర్ల నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల నమోదులో పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి బీఎల్వో ఓటరు ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుకొని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.