అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలీసులకు లొంగిపోయారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర పూరితంగా వ్యవహరించడం వంటి కేసులు.. మెడకు చుట్టుకోవడంతో ఆయన జార్జియా జైలు దగ్గర పోలీసుల ముందు లొంగిపోయారు. ఐతే.. ఆ తర్వాత బెయిల్ కూడా పొందారు.
డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి, లొంగిపోయి, 2 లక్షల డాలర్లు (రూ.1,65,23,270)ల పూచీకత్తు ఇచ్చి.. బెయిల్ పొందేందుకు.. అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. అందువల్ల ట్రంప్ జైలు దగ్గరకు వెళ్లారు. దాంతో పోలీసులు అయన్ని ఫార్మాల్టీ ప్రకారం అరెస్టు చేశారు. తర్వాత జైలులోకి తీసుకెళ్లారు. జైలులో ట్రంప్ 20 నిమిషాలు ఉన్నారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చేశారు. ట్రంప్‌పై ఇలా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
తనపై ఉన్న కేసులన్నీ కుట్రపూరితమేననీ, తాను ఏ తప్పూ చెయ్యలేదని ట్రంప్ అంటున్నారు. అంతేకాదు.. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని.. మళ్లీ గెలిచి చూపిస్తానని ట్రంప్ అంటున్నారు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా.. తాను నిర్దోషిగా తేలతానని అన్నారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులో ట్రంప్ అరెస్టయ్యారు. బెయిల్‌పై విడుదలయ్యారు. ఇలా ఈ కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ముగియకముందే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే.. ఆయనపై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు.