రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడానికి కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కేంద్ర, ఎన్నికల కమిషనర్ అదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే జారీ చేయగా అక్టోబరు 4న తుది ఓటరు జాబితా వెల్లడించడానికి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పర్యవేక్షణలో కసరత్తు ప్రారంభమైంది.
మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించే విధంగా నోడల్ అధికారుల నియామకం జరిగింది. ఎన్నికలు గడువు సమీపిస్తుండడంతో ఓటరు నమోదుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రధాన పార్టీల నాయకులు ఓటరు నమోదుపై దృష్టిపెట్టారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 2023 జనవరి 5న జారీ చేసిన తుది ఓటరు జాబితాకు ప్రస్తుతం జారీ చేసిన ముసాయిదా ఓటరు జాబితాకు మధ్య 10011 ఓట్లు పెరిగాయి. రెండు సెగ్మెంట్లలో గత జనవరిలో వెల్లడించిన తుది జాబితాలో 4,36,388 మంది ఓటర్లు ఉండగా సిరిసిల్ల నియోజకవర్గంలో 2,27,833 మంది ఓటర్లు, వేములవాడలో 2,08,505 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ముసాయిదా జాబితాలో 4,46,399 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,33,115 మంది, వేములవాడలో 2,13,284 మంది ఓటర్లు ఉన్నారు.
సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంతో పాటు మార్పులు, చేర్పుల కోసం జిల్లా యంత్రాంగం పరుగులు తీస్తోంది. పారదర్శకంగా నమోదు పక్రియను చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటుపై వివరాలు సేకరించే విధంగా కలెక్టర్ అదేశాలు జారీ చేశారు. ఓటరు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఓటరు నమోదు కార్యక్ర మంలో భాగంగా జిల్లాలో పోలింగ్ స్టేషన్ల వారీగా శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, అది రెండు రోజులు శిబిరాలు కొనసాగుతాయి. మళ్లీ సెప్టెంబరు 2, 3 తేదీల్లోనూ శిబిరాలను కొనసాగించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. ఓటరు నమోదుతో పాటు చేర్పులు, మార్పులు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా కొత్త ఓటరు జాబితాలను పరిశీలించి చనిపోయిన వారి పేర్లను తొలగించారు.
సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 19 వరకు స్వీకరించ నున్నారు. అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సెప్టెంబరు 28న తొలగిస్తారు. అక్టోబరు 1వ తేదీన ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని తుది ఓటరు జాబితా అక్టోబరు 4న వెల్లడించడానికి అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 4,46,399 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,17,497 మంది, మహిళలు 2,28,730 మంది జెండర్‌లు 16 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 156 మంది ఉండగా పురుషులు 150, మహిళలు అరుగురు ఉన్నారు. వీరిలో మహిళలే 11,089 మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,13,284 మంది ఓటర్లు ఉండ గా పురుషులు 1,03,127 మంది, మహిళలు 11,0091 మంది జెండర్‌లు 16 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 50 మంది ఉండగా పురుషులు 47, మహిళలు ముగ్గురు ఉన్నారు. వీరిలో మహిళలే 6,920 మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,33,115 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,14,370 మంది, మహిళలు 1,18,639 మంది ఉన్నా రు. సర్వీస్ ఓటర్లు 106 మంది ఉండగా పురుషులు 103, మహిళలు ముగ్గురు ఉన్నారు. వీరిలో మహిళలే 4,169 మంది ఓటర్లు అధికంగా ఉన్నారు.