chandrayan
జాతీయం ముఖ్యాంశాలు

చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష రంగం విలువ రూ. 82 లక్షల కోట్లకు చేరనుందా?

1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారి చంద్రుడిపై కాలుమోపి జాబిలిపై అడుగుపెట్టిన తొలి మానవుడిగా నిలిచారు. ”ఇది చిన్న అడుగే కావొచ్చు. కానీ, మానవజాతికి పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.

ఆ మాట ప్రపంచ అంతరిక్ష చరిత్రలో దాదాపు ఒక సామెతగా మారిపోయింది.

అది జరిగిన దాదాపు యాభై ఏళ్ల తర్వాత భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 బుధవారం సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది.

ల్యాండర్ విక్రమ్ నుంచి ఏటవాలు నిచ్చెన మీదుగా కిందకు దిగిన రోవర్ ప్రజ్ఞాన్, చంద్రుడి ఉపరితలంపై తన ప్రయాణాన్ని కూడా ప్రారంభించింది.

రోవర్ ప్రజ్ఞాన్ సెకనుకు ఒక సెంటీమీటర్ మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే, చంద్రుడి ఉపరితలంపై ఈ చిన్న అడుగు కూడా జియో పాలిటిక్స్ (భౌగోళిక రాజకీయాలు), లూనార్ ఎకానమీకి(చంద్రుడిపై విజయవంతమైన ప్రయోగాల ఫలితాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ) చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలకు తెలుసు.

”భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ కావడం జియో పాలిటిక్స్‌లో ఓ భారీ ముందడుగు” అని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఫారిన్ ఫాలసీ పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అంతరిక్ష పరిశోధనపై మరింత ఫోకస్ పెట్టాయి. అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తున్నాయి.

భారత్, రష్యా, చైనా, అమెరికానే కాకుండా దాదాపు అన్ని దేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

అలాంటి సమయంలో, భారత్ మిషన్ చంద్రయాన్ -3 అత్యద్భుత విజయం సాధించడం దక్షిణ ధ్రువం దిశగా మరిన్ని పరిశోధనలకు కొత్త మార్గాలను సృష్టించిందని భావిస్తున్నారు.