ఏపీకి మరోసారి వర్ష సూచన.. హెచ్చరించిన వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో ఈ నెల 4 వరకు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వానలు మొదలయ్యాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కోస్తాలో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.
ఉత్తరాది రుతుపవనాల ద్రోణి దక్షిణ దిశగా కదులుతున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. రుతుపవనాల ద్రోణితో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్ష సూచన చేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఉదయం ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి ఉత్తర దిశగా విస్తరించింది. దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం లేకపోతే ఈ సీజన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది.. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు.