trains-cancel
జాతీయం రాజకీయం

జీ20 సదస్సు కోసం 200కు పైగా రైళ్ల రద్దు…

భారత్ వేదికగా అంతర్జాతీయ జీ20 దేశాల సదస్సు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు కోసం కేంద్రం పలు ఆంక్షలు విధించింది. ఇందులో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లోనూ ఈ ఆంక్షలు విధిస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతుండటం, ఇందులో ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా అంతర్జాతీయంగా భారత్ పై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో ఇందులో ఎక్కడా రాజీపడటం లేదు.

జీ20 సదస్సు జరగనున్న కారణంగా రాజధాని ఢిల్లీలో రోడ్డు రవాణాతో పాటు న్యూఢిల్లీకి వెళ్లే రైళ్లు కూడా ప్రభావితం కానున్నాయి. జీ20 సదస్సు జరిగే రోజులతో పాటు ముందు, ఆ తర్వాత రోజుల్లోనూ దాదాపు 200కు పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది. సెప్టెంబరు 8-11 నుండి వేర్వేరు తేదీలలో ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో కొన్ని రైళ్లు దారి మళ్లించబడగా, మిగిలినవి పాక్షిక రద్దు లేదా రూటు మార్పులు కూడా ఉన్నాయి.

ఢిల్లీ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ‘G20 సమ్మిట్ 2023’ భద్రత, ఇతర ముఖ్యమైన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని, రైల్వేలు ఈ క్రింది విధంగా ‘ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ ప్రణాళిక’ను రూపొందించాయి. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఉత్తర రైల్వే అధికారులు కోరారు. దీంతో ప్రయాణికులు కూడా దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీ20 సదస్సు ముగిసిన తర్వాత కూడా 11వ తేదీ కూడా రైళ్ల రద్దు కొనసాగనుంది.

వాస్తవానికి రాజధాని ఢిల్లీకి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిత్యం వేలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పుడు జీ20 సదస్సు కారణంగా వాటి సమయాలతో పాటు అన్నీ మారిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అంతర్జాతీయ సదస్సు నిర్వహణ కారణంగా రైల్వే ఈ మార్పులు చేయడంతో చేసేది లేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ప్రయత్నిస్తున్నారు.