ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ దివాలా తీసినట్లు ప్రకటించింది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్ డాలర్లు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు దివాలా తీయడంతో.. అత్యవసరం కాని అన్ని ఖర్చులను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ నగరం సమాన వేతన క్లెయిమ్‌లు దాదాపు 956 మిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. లోకల్ గవర్నమెంట్ అసోసియేషన్ అదనపు సాయం అందించాలని సిటీ కౌన్సిలర్లు జాన్ కాటన్, షెరెన్ థాంప్సన్‌లు కోరారు. తమకు అందాల్సిన 1.25 బిలియన్ డాలర్ల నిధులను కన్జర్వేటివ్ ప్రభుత్వం లాక్కోందని థాంప్సన్ ఆరోపించారు.
ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్ స్ట్రీట్ స్పందించింది. తమకు అక్కడి ఆర్థిక సమస్యలు తెలుసని పేర్కొంది. అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా తాము సాయం అందిస్తామని ప్రధాని అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాలు కూడా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.