జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌పై కూడా ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడం సరికాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నుంచి నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలులో సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లారు. ఆయన నేటి నుంచి (సెప్టెంబర్ 15) రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు. తన భార్య అనారోగ్యం పాలు కావడం వల్ల సెలవు పెట్టినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన సెలవుతో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అదే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉండగానే సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.రెండు రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశమైన సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రత గురించి మాట్లాడుతూ.. అధికారులు భద్రత కల్పిస్తున్నా తనకు ఇంకా భయంగా ఉందన్నారు. తనలో సగ భాగాన్ని జైల్లో వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు. ప్రజల హక్కు, స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తిని వేధిస్తున్నారని.. మీరంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇది కుటుంబానికి, టీడీపీ క్యాడర్ కు, పార్టీ శ్రేణులకు ఇది కష్టకాలం అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఎన్నటికీ పార్టీ కోసం నిలుస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ చంద్రబాబు భార్యగా జైలుకు వెళ్లి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నానని చెప్పారు.
ఆయన సెక్యూరిటీపై ఇంకా భయంగా ఉందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి నెంబర్ 1 సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన ఆమె.. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. జైలులోనూ ప్రజల గురించే చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఎప్పుడు బయటకు వస్తాను ప్రజలకు సేవ చేయాలని అన్నారని భువనేశ్వరి చెప్పారు