modi
అంతర్జాతీయం రాజకీయం

మోడీ వ్యాఖ్యలు ఏపీకి కలిసొచ్చేనా

పార్లమెంటు పనితీరుపై ఎప్పుడు చర్చ జరిగినా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావిస్తారు. ఎన్నో వివాదాల మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజల హాహాకారాల మధ్య, తెలంగాణ యువత ఆత్మహత్యల మధ్య… చట్టరూపం దాల్చిన ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రస్తావన లేకుండా మోదీ తన ప్రసంగాన్ని పూర్తి చేయరు. ఈ విషయమై భారాస సర్కారు కూడా మోదీని విమర్శిస్తూనే ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుని మోదీ అవమానిస్తున్నారని మంది పడుతూనే ఉంటుంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజనని ప్రస్తావిస్తూ, నాటి సోనియా నియంతృత్వ వైఖరిని మోదీ ప్రశ్నించడం… ఆంధ్రప్రదేశ్ వాసులకి ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా గత కాంగ్రెస్ సర్కార్ తమకు చేసిన అన్యాయం ఇప్పటికీ ఏపీ హృదయానికి గాయం చేస్తూనే ఉంది. ఆ కోపంతోనే 2014, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు.

బిజెపి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ విభజన అంత అశాస్త్రీయంగా, దారుణంగా ఎక్కడా జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎప్పటికీ తన వైఖరిని సమర్ధించుకోలేదు. నాటి మన్మోహన్ సర్కార్ తొందరపాటు చర్యల వల్ల ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పార్లమెంట్లో నిన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆడ్డగోలు విభజనే ప్రస్తావించారు. అవశేష రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, నాటి కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. మెజారిటీ ఉందని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే పార్టీలకు భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో అదే జరిగింది. ఒక రాష్ట్ర విభజన ఎలా జరగకూడదో 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనే బిల్లే సాక్ష్యంఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాల్లో సంబరాలు జరగలేదన్నారు.

సోమవారం నాడు సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా, మంగళవారం నుంచి నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగిస్తూ ఏపీ, తెలంగాణ విభజనపై మాట్లాడారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని తెలిపారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికాబద్ధంగా చేశారని అన్నారు. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఎక్కడా సంబరాలు జరగలేదన్నారు. ఈ విభజన రెండు తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పర్చలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారన్నారు. అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందన్నారు,విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి చేతులు దులుపుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.

ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకంగా ఉంటుందన్నారు. అలాంటి వ్యవహారాన్ని సాదాసీదాగా చేశారన్నారు. 2022 ఫిబ్రవరిలో లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వార్థరాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించారన్నారు. అత్యంత దారుణంగా ఏపీని విభజించారన్నారు. మైకులు ఆపేసి, పెప్పర్ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారని విమర్శించారు.