bjp-cong
తెలంగాణ రాజకీయం

గులాబీ స్థానంలోకి వచ్చిన కాంగ్రెస్

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలంటే కొత్త కొత్త పథకాలు, అటు నాయకులు ఇటు పోవడం, ఇటు నాయకులు అటు పోవడం మామూలే కాబట్టి.. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార భారత రాష్ట్ర సమితి నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్తున్నారు.. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించనంతగా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు బలంగా ఉండడం, భారత రాష్ట్ర సమితి ఒంటెత్తు పోకడలు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం వైఖరి.. ఇన్ని పరిణామాలతో ఆ పార్టీలకు చెందిన నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి భారత రాష్ట్ర సమితిని గుర్తు చేస్తోంది.కాంగ్రెస్ పార్టీలో చేరికల దూకుడు కొనసాగుతూనే ఉంది. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ అసంతృప్త నాయకుల లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం వేగం పెంచడంతో చేరికలు జోరు అందుకుంటున్నాయి.

అటు రేవంత్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన భారత రాష్ట్ర సమితి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి.. మైనంపల్లి హనుమంతరావు నివాసానికి విక్రమార్క వెళ్లారు. ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. హనుమంతరావు తో పాటు ఆయన కుమారుడు రోహిత్, నక్క ప్రభాకర్ గౌడ్ మరికొంతమంది కార్పొరేటర్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.. రెండు నెలల కింద భారత రాష్ట్ర సమితిలో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత జూలై 25న అనిల్ కుమార్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సీటును సిట్టింగ్న ఎమ్మెల్యేకు కెసిఆర్ కేటాయించడంతో అనిల్ కుమార్ రెడ్డి ఆశించిన భువనగిరి సీటు దక్కలేదు. దీంతో అనిల్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్, రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ చర్చలు జరిపారు. ఈ పార్టీలో చేరేందుకు అనిల్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో.. రేవంత్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్, మరో నలుగురు జడ్పిటిసిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పిస్తోంది.. జనరల్ కోటాలో అయితే కసి రెడ్డి నారాయణరెడ్డి కి, బీసీ కోటాలో అయితే తనకు టికెట్ కేటాయించాలని బాలాజీ శరత్ విధించినట్టు తెలుస్తోంది. ఇక వీరే కాకుండా భారత రాష్ట్ర సమితి, బిజెపి నుంచి చాలా మంది నాయకులు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.భారత రాష్ట్ర సమితికి చెందిన బోథ్ ఎమ్మెల్యే బాపూ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భారత రాష్ట్ర సమితి అసంతృప్త నేత కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీలోకి తిరిగి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎల్బీ నగర్ లేదా మునుగోడు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇస్తామని ప్రతిపాదన ఆయన ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది.

ఇక భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ వర్గాలు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైపు మైనంపల్లి హనుమంతరావుకు మాల్కా జ్ గిరి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో సీఎల్పీ నేత విక్రమార్క, వీహెచ్, మల్లు రవి భేటి అయ్యారు. అయితే ఈ సమావేశంలో వారు ఏం మాట్లాడుకున్నారో బయటకి చెప్పలేదు. మొత్తానికి ఒకప్పుడు చేరికలతో భారత రాష్ట్ర సమితి “కారు” ఫుల్లుగా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ చేతినిండా నేతలతో కళకళలాడుతోంది. మరి ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పును ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

పాత వర్సెస్ కొత్త నేతలు…
 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. అసమ్మతి వర్గాలను మెనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే… కాంగ్రెస్ అధిష్టానం టికెట్లను ఎవరెవరికి కట్టబెట్టాలని ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ లో టికెట్లు రాని నేతలు కాంగ్రెస్ కు క్యూకట్టారు. పార్టీలో చేరేముందు వాళ్లకు టికెట్ హామీ దక్కిందని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో పార్టీని వీడకుండా, ఎన్నో అవంతరాలు అవమానాలు ఎదుర్కొని, పార్టీలోనే కొనసాగుతూ వచ్చామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం లేకపోయినప్పటికీ స్థానికంగా కార్యకర్తలకు అండగా నిలిచామంటున్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వడంతో పార్టీని అంటిపెట్టుకున్న నేతలు అసంతృప్తి చెందుతున్నారు. గత పదిహేళ్లుగా అధిష్టానం ఇచ్చిన పిలుపును కాదనకుండా మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రభుత్వ వైఖరిపై నిరసనలు చేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 నియోజకవర్గాల్లో సుమారు 94 మంది అభ్యర్థులు టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం వివిధ పార్టీలలో భంగపడ్డవారు సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ వారంలో కాంగ్రెస్ అధిష్టానం టికెట్లను ప్రకటిస్తున్నందున జాబితాలో తమ పేరు ఎక్కడ గల్లంతవుతుందోనని పాత నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ మరొకటి పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవర్గంలో ఖానాపూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ , బోథ్, నిర్మల్ , ముధోల్ లు ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలు ఉన్నాయి. ఇందులో 3 ఎస్టీ నియోజవర్గాలు, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్, చెన్నూర్ లో నల్లాల ఓదెలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరిక ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో రిజర్వ్ చేసిన ఐదు నియోజవర్గాలు తప్ప మిగతా ఐదు నియోజకవర్గాలలో బీసీ నేతలకు కనీసం ఒక సీటు అయినా దక్కుతుందా? లేదా? అని నేతలు చర్చించుకుంటున్నారు.