tamilisai
తెలంగాణ రాజకీయం

గవర్నర్ కు రిటర్న్ గిఫ్ట్… మళ్లీ ఎమ్మెల్సీల పేర్లు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ మంత్రివర్గం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం వివాదానికి దారి తీసింది. దీనిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా తమిళిసై టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారని, అలాంటి వారిని గవర్నర్‌గా నియమించవచ్చా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. తదుపరి ఎలా చేయాలనే దానిపై కేబినెట్ భేటీలో కేసీఆర్ చర్చించనున్నారు. వేరేవారిని నామినేట్ చేయాలా? లేదా గవర్నర్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్లాలా? అనే దానిపై చర్చ జరగనుందని తెలుస్తోంది దాసోజు శ్రావణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరిస్తున్నట్టు గవర్నర్‌ ప్రభుత్వానికి లేఖ పంపారు.  వారిద్దరికీ  ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వారి అర్హతలు సరిపోవని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ యోగం లేనట్లేనా ? కేసీఆర్ మళ్లీ వారి పేర్లనే కేబినెట్ లో తీర్మానం చేయించి గవర్నర్‌కు  పంపుతారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు తిరస్కరిస్తూ గవర్నర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తగిన అర్హతలు లేకుండా వారిని నామినేట్‌ చేయడం తగదు. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. అర్హులను పరిగణనలోకి తీసు కోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైంది కాదు.

ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయ కూడదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలను జత చేయలేదు…’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. కానీ ఇటీవలి కాలంలో గవర్నర్ కోటాలో కేబినెట్ సిఫారసు చేస్తున్న అన్ని పేర్లు రాజకీయ పునరావాసం కోసమే. పాడి కౌశిక్ రెడ్డి కి ఆమోదం తెలిపేందుకు గవర్నర్ నిరాకరించడంతో .. ఆ పేరు వెనక్కి తీసుకుని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును కేబినెట్ సిఫారసు చేసింది. తమిళిసై వెంటనే ఆమోదం తెలిపారు. కానీ వివాదాల్లేని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరించారు. గవర్నర్లు కేబినెట్ సిఫారసు చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన సందర్భాలు దాదాపుగా లేవు. ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నేతల్నే గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తున్నారు.  ఏపీలో కూడా అక్కడి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేసింది. అప్పట్లో బిశ్వభూషణ్ హరిచందన్, ఇప్పుడు  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్ కూడా ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు.  

ఏపీ నుంచి గవర్నర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన వారి పేర్లను పరిశీలిస్తే..  తోట త్రిమూర్తులు,  లేళ్ల అప్పిరెడ్డి , కుంభా రవిబాబు, కర్రి పద్మ అనే వాళ్లు ఉన్నారు. వీరంతా రాజకీయ నేతలే. పైగా తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డిపై  తీవ్రమైన కేసులు ఉన్నాయి. వీరి పేర్లను ఏపీ గవర్నర్లు ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వెనక్కి  పంపలేదు. ఆమోద ముద్రవేశారుపేరుకు గవర్నర్ కోటా కానీ.. గవర్నర్ ఎమ్మెల్సీలను నామినేట్ చేయలేరు.  మంత్రివర్గం చేసిన సిఫారసును మాత్రమే ఆమోదించాలి. ఎమ్మెల్సీల విషయం కాకుండా బిల్లులు, ఇతర విషయాల్లో అయితే  ఓ సారి గవర్నర్ వెనక్కి పంపితే.. రెండో సారి అదే బిల్లును పంపితే గవర్నర్ ఆమోదించాలనే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను పట్టుదలగా మళ్లీ  తెలంగాణ కేబినెట్ లో సిఫారసు చేసి పంపిస్తే.. ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుందని  భావిస్తున్నారు. కొత్త పేర్లను పంపిస్తే పెద్దగా పంచాయతీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటా లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి.