kcr
తెలంగాణ రాజకీయం

5 వేల కోట్లపైనే  కేసీఆర్ ఆశలు

బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించిన సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరైతే భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కార్డులతో బలం పుంజుకుంది. సాధారణంగా గ్రూపు కొట్లాటలు ఉండే ఆ పార్టీలో ఇప్పుడు కొత్త వాతావరణం కనిపిస్తుంది. దానికి భిన్నంగా భారత రాష్ట్ర సమితిలో నేతల మధ్య వివాదాలు పొడచూపుతున్నాయి. పైగా అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్ని సమస్యలకు నిధుల విడుదల ఒకటే పరిష్కార మార్గం అని కెసిఆర్ భావించారు. ఈ క్రమంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.మరో రెండు వారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 5000 కోట్లు విడుదల చేస్తామని ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. వీటిని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఖాతాల్లో జమ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే ప్రభుత్వం కేటాయించిన అరకొర నిధులు నిండుకున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2021 నుంచి ఎంపీలతో సమానంగా ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ ను మూడు నుంచి ఐదు కోట్లకు పెంచింది. అయితే అంతకుముందు సంవత్సరాలలో కోవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సిడిఎఫ్ కేటాయించలేదు. ఫలితంగా అప్పట్లో ఎమ్మెల్యేలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇక 2021 నుంచి సి డి ఎఫ్ రిలీజ్ అయినప్పటికీ అందులో మూడు కోట్ల నిధులను ప్రతి ఎమ్మెల్యే మన ఊరు మనబడి కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండు కోట్లు మాత్రమే మిగిలాయి. ఆ రెండు కోట్లు కూడా ఏ మూలకు సరిపోకపోవడంతో బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు మొత్తం ప్రగతి భవన్ ను ఆశ్రయిస్తున్నారు.

వచ్చేనెల 6న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొంది.క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా మారడం, ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికి ఒకింత నిరాశ వాతావరణం నెలకొనడంతో నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే బడ్జెట్లో ప్రభుత్వం ఎస్డిఎఫ్ కు పదివేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు తమ వద్ద నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు వీటినుంచి నిధులు కోరుతున్నారు. అయితే ఇవి కూడా సరిపోవని వారు అంటున్నారు. ఈ నిధులు కాంట్రాక్టుల బకాయిలు చెల్లించేందుకు కూడా సరిపోవని వారు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మెజారిటీ పనులను భారత రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధులు చేశారు. ఇప్పుడు వీరంతా బకాయి బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. వాటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధిని గురించి ఐదువేల కోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నిధులు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఎమ్మెల్యేల ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. మరి ఈ ఐదు వేల కోట్లు ఓట్లను రాల్చుతాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.