secre
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీ సెక్రటేరియెట్ లో రివర్షన్….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సెక్రటేరియట్ ఉద్యోగులకు షాకిచ్చింది. 50 మందికి కల్పించిన పదోన్నతులను వెనక్కి తీసుకుంది. సచివాలయంలో సెక్షన్‌ అధికారులుగా పని చేస్తున్న 50 మందికి…కొద్ది రోజుల క్రితం అసిస్టెంట్‌ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం వారిని ఇన్‌ఛార్జి అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ సెక్రటరీల నుంచి రివర్షన్‌ పొందిన 50మంది సెక్షన్‌ ఆఫీసర్లను ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం రివర్షన్ పొందిన వారందరి సర్వీసును ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. రివర్షన్‌ పొందిన 50 ఉద్యోగులను ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ సెక్రటరీలుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో, గతంలో సెక్షన్ అధికారులకు ఇచ్చిన పదోన్నతుల్ని ప్రభుత్వం రివర్షన్‌ చేసింది. తాత్కాలిక ఇన్‌ఛార్జి కార్యదర్శులుగా కొనసాగుతున్న వారికి, సెక్షన్‌ ఆఫీసర్ల పేస్కేలు మాత్రమే వర్తిస్తుందని  ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం.

హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకే ఇన్‌ఛార్జి అసిస్టెంట్ కార్యదర్శుల భాద్యతలు ఉంటాయని  ఆదేశాలు ఇచ్చింది. గత నెల గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 17 కేటగిరిల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.  నాలుగేళ్ల క్రితం సచివాలయాల్లో విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లుగా నియామకమైన వారిలో కొందరికి ప్రమోషన్లు ఇచ్చింది. హార్టికల్చర్ ఉద్యోగులకు అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి-1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతులు కల్పించింది. వివిధ జిల్లాల్లో కేటగిరి-1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు మొత్తం 53 ఖాళీ ఉండగా వీటిని విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు శాఖల ఆధ్వర్యంలో మెుత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. లక్షల్లో ఉద్యోగాల నియామకం చేపట్టింది. సచివాలయాల ఉద్యోగులకు ఏడాది క్రితం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. దీంతో వీరందరూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలు అందుకుంటున్నారు. వీరిలో కొందరు మండల స్థాయిలో పనిచేసేందుకు ఇటీవల పదోన్నతులు పొందారు. మిగిలిన వారి ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది.