amitabh
జాతీయం రాజకీయం

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌.. అమితాబ్‌ బచ్చన్‌కు రూ.10లక్షలు జరిమానా

పండుగ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో భారీ సేల్‌ నిర్వహిస్తోంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ పెట్టింది. అయితే ఈ సేల్‌కు సంబంధించి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తో ఓ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేసింది. అయితే, ఈ ప్రకటనపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఈ వివాదంతో బిగ్‌బీ కూడా చిక్కుల్లో పడ్డారు.ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటనపై ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిలా ఉందని, చిన్న వర్తకులకు వ్యతిరేకంగా ఉందని సీఏఐటీ ఆరోపించింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల పరిరక్షణ విభాగానికి ఫిర్యాదు చేసింది.

అదేవిధంగా ఈ యాడ్‌లో నటించిన అమితాబ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆయన చేసిన యాడ్‌ భారతదేశంలోని రిటైలర్‌లకు బాగా నష్టం వాటిల్లేలా ఉందని పేర్కొంది. ఈ ప్రకటనను వెంటనే తొలగించడమే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌, అమితాబ్‌కు రూ.10లక్షలు చొప్పున జరిమానా విధించాలని డిమాండ్‌ చేసింది.