ధాన్యం వర్కింగ్ అనుమతులకు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీలు చూపడం రైస్ మిల్లర్లకు కష్టంగా మారింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వర్కింగ్ ఛార్జీలు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడమే ఇందుకు కారణం. దీంతో, 2023-24 వ్యవసాయ సీజన్లో పండిన ధాన్యం సేకరణ ప్రణాళిక అమలు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సమీపంలోని రైస్ మిల్లుల్లో మరపట్టి గోదాములకు తరలిస్తోది. ఒక ఎసికె (29 వేల కిలోలు) ధాన్యం మరపట్టినందుకు రూ.4 వేలు, సార్టెక్స్ (మట్టి, నూకలు) తొలగించినందుకు రూ.25 వేలు, ఈ మొత్తం బియ్యం ఒక కిలోమీటరు ట్రాన్స్‌పోర్టేషన్‌కు రూ.250 చొప్పున ఛార్జీలను ప్రభుత్వం రైస్ మిల్లర్లకు చెల్లించాల్సి ఉంది. 2022-23 సీజన్‌కు సంబంధించి కృష్ణా జిల్లాలో 6.50 లక్షల టన్నులు, ఎన్‌టిఆర్ జిల్లాలో 1.60 లక్షల టన్నుల చొప్పున మొత్తం 8.10 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. కృష్ణా జిల్లాలో 151 రైస్ మిల్లులు, ఎన్‌టిఆర్ జిల్లాలో 22 మొత్తం మిల్లుల్లో ఈ మొత్తాన్ని ప్రాసెస్ చేసి వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సమీపంలోని ఎఫ్‌సిఐ, పౌరసరఫరాల శాఖ గోదాములకు తరలించారు.
రైస్ మిల్లర్లకు 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వర్కింగ్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి జిల్లాలోని రైస్ మిల్లులకు రూ.166.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.మరో 45 రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ధాన్యం సేకరణ మొదలుకానుంది. ఆర్‌బికెల ద్వారా సేకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంక్ గ్యారెంటీ చూపిన రైస్ మిల్లర్లకు మాత్రమే ధాన్యం తోలడానికి పర్మిట్ ఇస్తారు. గంటకు ఒకటి నుంచి రెండు టన్నులు వర్కింగ్ సామర్థ్యం ఉన్న రైస్ మిల్లు రూ.50 లక్షలు, 6 నుంచి 10 టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు బ్యాంక్ గ్యారెంటీలు చూపాలి. గత రెండు సీజన్ల వర్కింగ్ ఛార్జీలు ఒక్కో రైస్ మిల్లుకు సగటున రూ.40 లక్షల నుంచి రూ.కోటికిపైగా రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో నగదు డిపాజిట్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు చూపడం సమస్యగా మారుతోందని రైస్ మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గంటకు మూడు టన్నులు పూర్తి సామర్థ్యంతో మర ఆడిన రైస్‌మిల్లుకు గత సీజన్‌లో నెలకు సగటున లక్ష రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేది. ఈ ఏడాది 30 శాతం వరకు పెరిగి రూ.1.30 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు ఇంధన సర్ధుబాటు ఛార్జీల భారం పడుతోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ధాన్యం వర్కింగ్ ఛార్జీలు పెంచాలని రైస్ మిల్లర్లు కోరుతున్నారు.