chandra-high
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊర‌ట 16వ తేదీ వ‌ర‌కు అరెస్టు చేయొద్ద‌ని కోర్టు ఆదేశాలు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అంగ‌ళ్లు కేసులో 12వ తేదీ వ‌ర‌కు, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వ‌ర‌కు అరెస్టు చేయొద్ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు రెండు కేసుల్లోనూ ఉన్న‌త న్యాయ‌స్థానం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అంగ‌ళ్లు కేసులో చంద్ర‌బాబు దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌పై హైకోర్టులో బుధ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఈ రెండు కేసుల్లోనూ బాబును అరెస్టు చేయ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోర్టును ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ కోరారు. ఈ కేసుల్లో విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తామ‌ని కోర్టుకు తెలిపారు. ఈ విష‌యంపై సీఐడీ, హోంశాఖ‌తో మాట్లాడి చెప్పాల‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాదుల‌కు కోర్టు సూచించింది.

ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉంద‌ని కోర్టుకు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరామ్ తెలిపారు. ఈ ద‌శ‌లో బాబుకు ముంద‌స్తు బెయిల్ ఇవ్వొద్ద‌ని కోరారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం రెండు కేసుల్లోనూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.