kharif
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఖరీఫ్ లో భారీగా తగ్గిన వరి

ఈ మారు ఖరీఫ్‌లో ముందుగా అనుకున్నదానిలో కనీసం ఐదు లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడులు తగ్గనున్నాయి. ఈ సీజన్‌లో 67.43 లక్షల టన్నులు ఆశించగా 62.43 రావొచ్చని చెబుతున్నారు. తగ్గనున్న ధాన్యం విలువ సుమారు రూ.పది వేల కోట్లని అంచనా. సేద్యం తగ్గడం వలన ఈ క్షీణత ఏర్పడుతోంది. ఈ అంచనాలకు ఆగస్టులో వేసిన ఉత్పాదకత గణాంకాలు ప్రాతిపదిక. వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పాదకత తగ్గితే ధాన్యం ఉత్పత్తి ఇంకా పడిపోతుంది. 2023-24 ఖరీఫ్‌లో 36.55 లక్షల ఎకరాల్లో వరి సాగు ద్వారా 67.43 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని ఆశించారు. సగటు ఉత్పాదకత ఎకరాకు 1,845 కిలోలు లభిస్తాయన్నారు. కాగా అంచనా వేసిన సాగులో దాదాపు రెండున్నర లక్షల ఎకరాలు తగ్గుతోంది. ఫలితంగా ఉత్పత్తి సైతం తగ్గుతుంది. అకాల వర్షాలు, వర్షాభావం, డ్రైస్పెల్స్‌, సాగునీటి కొరత, కాల్వల చివరి భూములకు నీరు అందకపోవడం, విద్యుత్‌ కోతలు, తెగుళ్లు వరి పైరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అందువలన కొన్ని చోట్ల త్పాదకత తగ్గుతుందని చెబుతున్నారు.

సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఉత్పాదకత కూడా తగ్గితే ధాన్యం ఉత్పత్తి ముందస్తు అంచనాల కంటే మరింత తగ్గే అవకాశం ఉంది. ఇదిఇలా ఉండగా ఇప్పటికే బియ్యం ధరలు కొన్ని నెలలుగా ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. స్థానికంగా ధాన్యం ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గే పక్షంలో బియ్యం ధరలు ఇంకా ప్రజలకు మంట పుట్టిస్తాయిరాష్ట్ర విభజన తర్వాత గడచిన పది ఖరీఫ్‌ సీజన్లలోకెల్ల ఇప్పుడే కనిష్ట వరి సాగు నమోదైంది. గరిష్ట సాగు 2014-15లో జరిగింది. కనిష్ట ధాన్యం ఉత్పత్తి 2015-16లో వచ్చింది. కనిష్ట ఉత్పాదకత 2020-21లో లభించింది. రాష్ట్రంలో వరి సాగు తగ్గడం ఆందోళన కలిగించే విషయం. వరుసగా మూడేళ్లలో ఈ ధోరణి కనిపిస్తోంది. సాగు, ఉత్పత్తి, ఉత్పాదకతలో స్థిరత్వం ఉండట్లేదు. కోస్తాలో చేపలు, రొయ్యల చెరువుల ప్రభావం వరి సాగు తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. తుపాన్లు, వరదలు, వర్షాభావం, తెగుళ్లు, గిట్టుబాటు ధర లేమి వలన వరి సాగు పట్ల రైతుల్లో కొంత వరకు నిర్లిప్తత నెలకొంటోందన్న ప్రచారం సాగుతోంది.డెల్టా కాల్వలకు ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చితే ఈ తడవ ముందుగానే నీరు విడుదల చేశారు.

ప్రకాశం బ్యారేజికి పై నుంచి నీటి ప్రవాహం తక్కువ రావడం, ఎగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులలో తగినంతగా నీటి నిల్వలు లేని కారణంగా మూడేళ్లుగా మూతపెట్టిన పట్టిసీమ మోటార్ల దుమ్ముదులిపి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజికి తరలించి కృష్ణా డెల్టాను కొంత వరకు ఆదుకుంటున్నారు. సాగర్‌ కుడికాల్వ ఆయకట్టులో వరి సాగుకు బంద్‌ పెట్టారు. కెసి కెనాల్‌ ఆయకట్టుకు నీరు రాక ఉమ్మడి కర్నూలు, కడపలో వరి సాగు లేదు. కరువు పరిస్థితులతో వర్షాధారంపై ఆధారపడ్డ వరి విస్తీర్ణం బాగా దిగజారింది. భూగర్భ జలాలున్నా, ఉచిత విద్యుత్‌ ఇస్తున్నా కోతల కారణంగా సాగు సాగట్లేదు.