తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. సీఈసీ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 30న ఒకే విడతలో 119 ఆసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరందుకుంది.ఎన్నికల షెడ్యూలుతో సంబంధం లేకుండా చాలా కాలంగా ఎన్నికల అగ్నిగుండలో రగులుతున్న రాష్ట్ర రాజకీయం,షెడ్యూలు విడుదలతో మరింత వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు మూడూ వ్యూహలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా, ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో, వ్యూహాత్మకంగా, ముందుగానే, అభ్యర్ధులను ప్రకటించి, ప్రత్యర్ధులకు సవాలు విసిరారు. మొత్తం 119 నియోజక వర్గాలకు గాను, 115 నియోజక వర్గాలకు గతంలోనే అభ్యర్ధులను ప్రకటించారు.
అందులోనూ ఎవరూ ఉహించని విధంగా, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన డజను మంది ఎమ్మెల్యేలతో పాటుగా, 108 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే, ఇప్పడు బీఆర్ఎస్ అభ్యర్ధులకు బీ ఫారం ఇస్తారని వార్తలు వస్తున్న నేపధ్యంలో కొత్త చర్చ తెరపై కొచ్చింది. టికెట్లు ఇచ్చిన వారందరికీ, బీ ఫారం ఇస్తారా? లేదా ..? అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లోనే బలంగా సాగుతోంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక్క సారిగా సైలెంటై పోయారు. సైలెంట్ గా ఇంటర్నల్ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. అందులో భాగంగా ఏ రోజుకా రోజు వార్ రూమ్ కు వస్తున్న సమాచారం, ఫ్రెష్ సర్వే రిపోర్టుల ఆధారంగా, ఇతర అంశాలతో పాటుగా అభ్యర్ధులను మార్చే విషయంలోనూ సీరియస్ కసరత్తు జరుగుతోందని, అంటున్నారు. టికెట్ ఇచ్చిన వారందరికీ బీ ఫారం ఇస్తారా, లేక ..కొందరికి మొండి చేయి చూపుతారా అనే విషయంలో పార్టీ వర్గాల్లో తెగ టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికల పనుల్లో తలముకలైన అభ్యర్ధులకు బీ ఫారం బెంగ పట్టుకుందని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా ఒకేసారి సారి 115 నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో పాటుగా, కొద్ది మంది మినహా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికట్ ఇచ్చి రైట్ చెప్పినప్పుడే చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటికే టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానంతో పక్క చూపులు చూస్తున్న వారిని కట్టడి చేసేందుకే కేసీఆర్ గంపగుత్తగా ఆల్మోస్ట్ అందరికీ టికెట్ ఇచారు కానీ . టికెట్ ఇచ్చిన అందరికీ బీ ఫారం గ్యారెంటీ లేదనే ప్రచారం అప్పట్లోనే జరిగింది. అయితే అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఒకటి అరా మినహా పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. అయితే తాజా సర్వేలు, ముఖ్యమంత్రి కేసేఅర్ నెల రోజులకు పైగా సాగిస్తున్న అంతర్గత మథనం నేపధ్యంలో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.
ప్రభుత వ్యతిరేకత ఉండనే ఉంది. అంతకంటే ఎక్కువగా సగం మందికి పైగా సిట్టింగుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఆయా నియోజకవర్గాలలో ఉందని తేలడంతో అలా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సగం మంది సిట్టిగిలకు బీ ఫారం ఇవ్వక పోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమయంలో కేసీఆర్ అంత సాహసం చేస్తారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆదివారం బీఫాంలు ఇచ్చిన తరువాత బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు మరోసారి భగ్గుమనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.