- బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా?
- ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు
- బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్
- ఢిల్లీ తెలంగాణభవన్‌కు 2న భూమిపూజ
- సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం
- అక్టోబర్‌లో జిల్లా పార్టీ కార్యాలయాలు ప్రారంభం
- అక్టోబర్ లేదా నవంబర్‌లో ద్విదశాబ్ది ఉత్సవాలు
ప్రజల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి కార్యక్రమాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలుచేయగలుగుతారా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు నిలదీశారు. దళితబంధుపై చాలామంది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, 75 ఏండ్లలో ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేని, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు, పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురాలేని దద్దమ్మలు పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయం (తెలంగాణ భవన్) నిర్మాణానికి సెప్టెంబర్ 2న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ చేస్తారని తెలిపారు. అదేరోజు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభిస్తామని, అక్టోబర్ లేదా నవంబర్‌లో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ముమ్మాటికీ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఎన్నిక ఏదైనా తిరుగులేని విజయం
ఉద్యమ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్ కేసీఆర్ నాయకత్వంలో రాజకీయశక్తిగా అవతరించి ఎన్నిక ఏదైనా తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గత విజయాలను గుర్తు చేసుకొంటూ.. భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. ఏ లక్ష్యం కోసం టీఆర్‌ఎస్ ఆవిర్భవించిందో దానిని పూర్తిచేసుకుని.. సాధించిన రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అడుగడుగునా అండగా ఉంటూ ఆశీర్వదిస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం 80-90% పూర్తయింది. అక్టోబర్‌లో విజయదశమి (దసరా) నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించాలని నిర్ణయించాం. హస్తినలో 1200 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించనున్న టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణభవన్‌కు సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, చట్టసభ సభ్యులందరూ హాజరవుతారు.
దళితబంధులో పార్టీ భాగస్వామ్యం కావాలి
రాష్ట్రంలో వివిధ కులవృత్తుల వికాసానికి రాష్ట్రప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను తీసుకున్నది సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు. సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉండగా సీఎం కేసీఆర్ తనంతట తానుగా చొరవ తీసుకొని దళిత చైతన్యజ్యోతి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అదేస్ఫూర్తితో నేడు రాష్ట్రంలో 17 లక్షల దళితకుటుంబాల ఆర్థిక ఉద్దీపన కోసం దళితబంధు తీసుకొచ్చారు. దళితబంధు పథకంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గమంతా ఎక్కడికక్కడ భాగస్వాములై చైతన్యవంతంగా పనిచేయాలి. దళితబంధు పథకం విజయవంతానికి పార్టీ ఏం చేయాలనే విషయాలను పార్టీ కార్యవర్గంలో చర్చించుకున్నాం. రేపో ఎల్లుండో కేశవరావు నేతృత్వంలో మరోసారి సమావేశమై ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలి అనేదానిపై చర్చిస్తాం. ఉత్సాహభరిత, ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎం కేసీఆర్ అనేక విషయాలపై మనసువిప్పి మాట్లాడారు. అన్ని విషయాలను చెప్పిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
టీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండ విజయం
టీఆర్‌ఎస్ పుట్టాక, రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. అందులో హుజూరాబాద్ కూడా ఒకటి. అంతేతప్ప మరోటి కాదు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారే తప్ప.. హుజూరాబాద్ అనేపేరు ప్రస్తావించలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ వస్తే దాని ప్రస్తావన వస్తది. అప్పుడు పార్టీ చర్చిస్తది. అంతకుముందే పత్రికల్లో రాసినా.. టీవీల్లో చర్చించినా అదొక భ్రమ మాత్రమే. హుజూరాబాద్ మాకు చాలా చిన్న విషయం. మిగతా వాళ్ల మనస్సు దానిచుట్టే పరిభ్రమిస్తున్నది. మాకు ప్రజలకు సంబంధించి అనేక పనులున్నాయి. పనిచేసే ప్రభుత్వానికి.. పనిచేసే నాయకుడికి.. పనిచేసే పార్టీకి ప్రజలు తప్పకుండా అండగా నిలబడతారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్ బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. హుజూరాబాద్ మొదటి నుంచి టీఆర్‌ఎస్ కంచుకోట. 2001లోనే పార్టీ పుట్టిన వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలుచుకున్నాం. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌లో 2003లో చేరారు. అప్పుటికే కమలాపూర్ (ఇప్పుడు హుజూరాబాద్) నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు బలమైన అడ్డ.
దళితులే కడుపేదరికంలో..
75 ఏండ్లు అధికారంలో ఉండి మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థులు.. కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు.. ప్రభుత్వాన్ని నడపచేతగాని, కనీసం పేదరిక నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురానివారు పిచ్చి ప్రేలాపనలు పేలితే మేం స్పందించం. కానీ, ప్రజలకు మేం జవాబుదారీ కాబట్టి, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభలో స్పష్టంగా చెప్పారు. పేదరిక నిర్మూలన అన్నప్పుడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి నుంచి (బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ నుంచి) ప్రారంభించాలి. ఏ సామజిక, ఆర్థిక విశ్లేషణ తీసుకున్నా, సమగ్ర కుటుంబ సర్వే తీసుకున్నా సమాజం లో అట్టడుగున ఉన్నది కచ్చితంగా దళితులే. సమాజంలో అట్టడుగున ఉన్న దళితజాతిని తప్పకుండాపైకి తీసుకురావాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును చేపట్టారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా.. ఈ పథకాన్ని విమర్శిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్నరాష్ర్టాల్లో దళిత బంధును అమలుచేయాలి. ఇటువంటి కార్యక్రమంకానీ లేదా వారు డిమాండ్ చేస్తున్నట్టు బీసీబంధు లాంటి కార్యక్రమం కానీ అమలు చేయమనండి. మేం బీసీబంధు అమలు చేస్తమా.. లేక ఇంకోటి చేస్తామా? అనేది మా పాలసీకి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. అంతేకాని పనికిమాలిన ప్రతిక్షాలు.. పనిలేని కొంతమంది విమర్శలు చేయటానికే పుట్టినవాళ్ల వారి పిచ్చి ప్రేలాపనలను మేం పట్టించుకోం.
చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు రండి
సీఎం కేసీఆర్ ఏదిచేసినా ముందే అనుమానాలు వ్యక్తంచేస్తరు. బలహీనమైన గుండె ఉన్నవాళ్లు అవలీలగా ఢాం అని అడ్డంపడతరు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిననాడు, తెలంగాణ వస్తది అన్ననాడు కూడా ఇట్లానే పిచ్చిప్రేలాపనలు చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దళితబంధు ప్రారంభిస్తే కూడా ఇట్లనే అంటున్నరు. ముందు నవ్వుతరు. వెకిలి మాటలు మాట్లడతరు. అవమానిస్తరు. ఆఖరికి గెలిచాక పక్కకొచ్చి ఫొటో దిగి పోతరు. అట్లా మాట్లాడేవాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు వచ్చి దళితబంధులో పాల్గొనండి. దళిత కుటుంబాలతో మీరుకూడా కూర్చొండి. రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దానిని ఎట్లా ఇరవై చేయాలె.. ఇరవైని ముప్ఫై చేయాలో గైడ్ చేయండి.. మేమేం వద్దనటం లేదు కదా! ఒక పాలసీ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఢిల్లీలో మా పార్టీ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ ఉంటుంది. తరువాత ఏమి జరుగుతదో మాకేం తెలు సు.. మీకే తెలుసు అని మంత్రి కేటీఆర్ ముగించారు. సమాశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు , కార్యదర్శులు సత్యవతి రాథో డ్, రాములు, బడుగుల లింగయ్యయాదవ్, మాలో తు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్, వీజీ గౌడ్, బస్వరాజు సారయ్య, శంభీపూర్‌రాజు, తాడూరి శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, బండి రమేశ్, ఫరూక్ హుస్సేన్, ఫరీదుద్దీన్, ఇంతియాజ్ ఇసాక్, రాధాకృష్ణశర్మ, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్‌లో సంస్థాగత నిర్మాణం పూర్తి
వచ్చేనెల 2 నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత మండల, మున్సిపల్, పట్టణ కమిటీలతోపాటు, జిల్లా కమిటీలు కూడా వేసుకొంటాం. గతంలో నిలిపివేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. జిల్లా కమిటీలు పూర్తయ్యాక రాష్ట్ర కమిటీ ఏర్పాటుచేస్తాం. ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ అంతా సెప్టెంబర్‌లోనే పూర్తిచేయాలని రాష్ట్ర కమిటీలో తీర్మానం చేశాం. సంస్థాగత కమిటీ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు నేతృత్వంలో పనిచేస్తుంది.
కేంద్రంనోట తెలంగాణ నంబర్‌వన్
ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని స్వయంగా కేంద్రమే ప్రకటించింది. పశుసంపదను గణనీయంగా పెంచిన, సాగునీటి రంగంలో అద్భుతాలు సాధిస్తున్న, వ్యవసాయ దిగుబడిలో అద్భుతాలు సృష్టిస్తున్న, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అగ్రభాగన నిల్తుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్తున్నది. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయటంలో తెలంగాణ ముందుభాగంలో ఉన్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆర్థికమంత్రి హరీశ్‌రావు నిన్ననే గణాంకాలతో సహా అన్ని విషయాలు వెల్లడించారు. ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించిన టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగాచేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. త్వరలో ఏర్పడే కొత్త కమిటీ ఉత్సవాలను నిర్వహించేది అక్టోబర్‌లోనా లేక నవంబర్‌లోనా అనేది నిర్ణయిస్తుంది.
త్వరలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు
కరోనా కారణంగా గత రెండేండ్లుగా పార్టీ ప్లీనరీని జరుపుకోలేకపోయాం. వార్షికోత్సవ సభలు కూడా నిర్వహించలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షల మందితో ఘనంగా జరిపే ఆనవాయితీ టీఆర్‌ఎస్‌కు ఉన్నది. కరోనా పరిస్థితిని చూసుకొని సరైన సమయంలో.. అక్టోబర్ చివర లేదా నవంబర్‌లో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవసభ జరపాలని నిర్ణయించాం. టీఆర్‌ఎస్ ఒక ఉద్యమసంస్థగా సాధించిన రాష్ర్టాన్ని రాజకీయసంస్థగా ప్రగతిబాటలో ముందుకు తీసుకెళ్తున్నది. ఇన్ని చిరస్మరణీయమైన విజయాలు సాధించటం మాములు విషయం కాదు. అది నేను చెప్తున్న మాట కాదు. కేంద్రప్రభుత్వమే చెప్పినమాట.