anganwadi
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సమ్మె విరమణలో ప్రభుత్వం సక్సెస్

ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఈ తొలగింపునకు సంబంధించి కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలపై ఒత్తిడి పెరిగింది. ఒక్క రూపాయి వేతనం పెంచకుండానే అంగన్వాడీలతో ప్రభుత్వం సమ్మె విరమింపజేసింది. సోమవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇవి సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.అయితే జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడం విశేషం.

మరో రెండు నెలల్లో వైసీపీ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుంది. ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. కొత్త ప్రభుత్వం తరఫున వైసీపీ సర్కార్ హామీ ఇవ్వడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో.. అంగన్వాడీ వర్కర్ కు రూ.1.20 లక్షలు, హెల్పర్ కు రూ.60 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మట్టి ఖర్చుల కోసం రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. 42 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసులు ఎత్తివేస్తామని కూడా హామీ ఇచ్చింది.అయితే ప్రధాన డిమాండ్ గా ఉన్న జీతాల పెంపు విషయంలో మాత్రం ప్రభుత్వం మొండి చేయి చూపింది. జూలై నుంచి వేతనాలు పెంచుతామని చెప్పుకొచ్చింది. అయితే ఒత్తిళ్ల మూలంగానే అంగన్వాడీలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వారికి అనేక రకాల ఒత్తిళ్లు, బెదిరింపులకు గురిచేసి సమ్మెను విరమింప చేశారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగిన 70000 మంది అంగన్వాడి మహిళలపై వేటు వేశారు. కలెక్టర్లకు సోమవారం ఎక్కడికక్కడే ఉత్తర్వులు ఇప్పించారు. కొంతమందికి తొలగింపు పత్రాలను కూడా అందించారు. ఈనెల 25 నుంచి కొత్త నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 26న దరఖాస్తులు స్వీకరించి.. 31 లోపు ప్రక్రియ ముగిసేలా కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలతో అంగన్వాడీలు ఆందోళనకు గురయ్యారు. సమ్మె విరమణ శ్రేయస్కరమని భావించారు.అంగన్వాడీలకు బలవంతపు సమ్మె విరమణలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సీఎం జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడలేదు. గత ఎన్నికలకు ముందు జగన్ అంగన్వాడీలకు చాలా రకాల హామీలు ఇచ్చారు.

తాను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.1000 అదనంగా జీతం చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఇతరత్రా రాయితీలు కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి మరిచిపోయారు. గత 42 రోజులుగా సమ్మెబాట పట్టినా పట్టకుండా వ్యవహరించారు. రాజకీయ కార్యకలాపాల్లో మునిగితేలారే కానీ.. అంగన్వాడీలతో చర్చలకు ఇష్టపడలేదు. దీంతో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని రకాల బెదిరింపులకు దిగి.. అంగన్వాడీలతో సమ్మె విరమింపచేశారు.