- డెల్టాకు, దీనికి పెద్ద తేడా లేదు
- తీవ్రత ఎక్కువేం కాదు.. కానీ.. వేగంగా వ్యాపించే అవకాశం
- నిర్లక్ష్యం ఖరీదు భారీ మూల్యం!
- సీసీఎంబీ శాస్త్రవేత్తల హెచ్చరిక
డెల్టా.. ఈ కరోనా రకం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఇప్పుడు దీనికి తోడుగా డెల్టా ప్లస్ వచ్చేసింది. సేమ్ టు సేమ్ అన్నట్టు.. మొదట్లో అడపాదడపా కేసులే నమోదయ్యాయి, నమోదవుతున్నాయి. డెల్టా సృష్టించిన విలయానికి మనుషులు పిట్టల్లా రాలిపోయారు. మరి డెల్టా ప్లస్ ప్రభావమెంత? అని సీసీఎంబీ పరిశోధన చేయగా ఈ రెండు వేరియంట్లకు పెద్ద తేడా లేదని తేలింది. డెల్టా ప్లస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డెల్టా మాదిరే దావనలంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్‌కు పెద్దగా తేడా లేదని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణ, ఏపీలో సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సీ చేయగా ఒకటి, రెండుచోట్ల డెల్టా ప్లస్ వేరియంట్ మ్యుటేషన్ బయటపడింది. అయితే, మనం భయపడుతున్నట్టు మరీ తీవ్రంగా లేదని ప్రాథమిక పరిశోధనలో తేలినట్టు వెల్లడించా రు. కానీ.. ఇది డెల్టా వేరియంట్ (బీ.1.617) మాదిరిగానే వేగంగా వ్యాపించే అవకాశమున్నదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్లీ దావానలంలా వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దేశంలోని కొన్నిరాష్ర్టాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 50 వరకు కేసులను గుర్తించారు. రెండున్నర నెలల కింద టే వైరస్ మ్యుటేషన్ ఉనికి ప్రారంభమైంది. ఏప్రిల్‌లో తిరుపతిలో ఒకవ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో డెల్టాప్లస్ మ్యుటేషన్‌ను సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ‘ఇప్పటికే తిరుపతిలో ఈ రకం కేసులు మరిన్ని వెలుగుచూడాలి.
కానీ, అలాంటి ఆధారాలేవీ కన్పించలేదు’ అని వెల్లడించారు. కొత్త వేరియంట్ చిన్నగా మొదలై ఆ తర్వాత అంతటా వ్యాప్తి చెందేందుకు సమయం పడుతుందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా చెప్పారు. ప్రస్తుతానికి డెల్టా ప్లస్ కేసులు తక్కువగా ఉన్నా తేలిగ్గా తీసుకోవద్దని పరిశోధకులు తెలిపారు. ఈ రకం వ్యాప్తి తీరుతెన్నులు తెలిసేవరకు అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్ప ష్టంచేశారు. వ్యాప్తి తీవ్రమయ్యేకంటే ముందే ప్రజలు, ప్రభుత్వాలు మరిన్ని ముందుజాగ్రత్తలు తీసుకొంటే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని వెల్లడించారు. గతంలో మాదిరి అలక్ష్యంగా ఉంటే సెకండ్‌వేవ్ లాంటి పరిస్థితి మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ సంక్రమణం పొరుగు రాష్ర్టాల్లో ఉన్నందున తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.