ghmc commissioner
తెలంగాణ రాజకీయం

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను  పకడ్బందీగా నిర్వహించాలి

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు,  ఏ.ఆర్.ఓ లకు పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించు పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఫారం -12 అందించి, పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పూర్తి వివరాలను  పూరించి వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసే విధంగా ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ  జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న వారికి, ఇతర జిల్లాలో పని చేస్తూ హైదరాబాదు జిల్లాలో ఓటు హక్కు ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాజువల్ లీవ్ వెసులుబాటు కల్పించిందన్నారు. నిబంధనల మేరకు ఆయా ప్రక్రియ పూర్తి చేయాలని,ఎన్నికల విధులలో ఉన్న అధికారులు సిబ్బంది అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాలని సూచించారు.
అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్,  రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురి శెట్టి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే,     జిహెచ్ఎంసి ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏ.ఆర్.ఓ లు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.