చెక్ రిపబ్లిక్ లోని నాడ్ లాబెమ్ పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా మిలియన్ డాలర్ల సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కమిల్ ముందుగా ఓ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారికి భారీగా సొమ్మును బహుమతిగా అందించాలనుకున్నాడు. అయితే, అతడు పెట్టిన పోటీలో ఎవరూ గెలవలేకపోయారు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాడు. పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరుగంటలకు ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆ సమయానికి రావాల్సిందిగా ఓ ప్రదేశాన్ని మెయిల్‌ద్వారా సమాచారం ఇచ్చాడు.
ఇక అనుకున్న సమయానికి నిర్దేశించిన ప్రాంతానికి ఓ కంటైనర్‌లో ఒక మిలియన్ డాలర్లను నింపుకొని వెళ్లాడు. హెలికాఫ్టర్ ద్వారా లాబెమ్ పట్టణానికి సమీపంలోని ప్రదేశంలో ఆ డబ్బును జారవిడిచాడు. అతడు జారవిడిచిన మొత్తం డబ్బు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.8 కోట్లకు పైమాటే. ఇక ఆ డబ్బుకోసం అక్కడున్న వారు పోటీపడి మీరీ దాన్ని పోగు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కమిల్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.