తెలంగాణ రాజకీయం అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్‌కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమి అండగా నిలిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఆయన పక్కన పెట్టి అభివృద్ధి ఆయుధంతో బరిలోకి దిగారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చారు. జాతీయ పార్టీలన్నీ దండగ.. తెలంగాణ మన ఇంటి పార్టీ .. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది.
ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటీనీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. స్వయం పాలన భావజాలంతో ఏర్పడిన పార్టీతో కేసీఆర్ తాను అనుకున్నది సాధించారు. కానీ పదేళ్ల తర్వాత పార్టీ పేరు మార్చడం ద్వారా కేసీఆర్ .. తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేశారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం.. తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు మొదట్లోనే విమర్శలు చేశాయి. కేసీఆర్‌కు తెలంగాణతో పేగుబంధం లేదని.. ఇప్పుడు పేరు బంధం కూడా తొలగించుకున్నారని రేవంత్ గతంలో విమర్శించారు. బండి సంజయ్.. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని అన్నారు. ప్రజల్లో కూా విస్తృత చర్చ జరగింది. దీంతో కేసీఆర్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి అనే అంశానికి పెద్దగా ప్రచారం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తగ్గించారు. కొంత కాలం మహారాష్ట్రపైనే దృష్టి పెట్టారు.
ఇటీవలి కాలంలో మహారాష్ట్ర వైపు కూడా వెళ్లడం లేదు. అయినా పోటీ పడుతోది టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్ అనే భావన ప్రజల్లో పెంచేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్ ద్వారానే పోటీ అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. మూడోసారి తెలంగాణలో గెలిస్తే … వచ్చే ఇమేజ్ తో దేశంలో కీలక పాత్ర పోషించవచ్చని నమ్ముతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు … ఆయన అడుగులు… ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టి పడేస్తాయి. అయితే ఆయన బలం అంతా తెలంగాణ సెంటిమెంట్ లోనే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు ఎక్కడ మాట్లాడినా ప్రజలు ఎంతో ఆసక్తి చూపించేవారు.
ఈ సారి కేసీఆర్ పూర్తిగా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రజలకు గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. కేసీఆర్ తనకు.. తన పార్టీకి ఇప్పటి వరకూ అండగా ఉన్న కవచకుండలం లాంటి సెంటిమెంట్ ను వదిలేసి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఫలితాన్ని బట్టి.. .. చరిత్రలో కేసీఆర్ పేరు ఎలా ఉంటుందన్నది స్పష్టత వస్తుంది.