దసరా పండుగ అంటే తెలంగాణలో ధూంధాంగా ఉంటుంది. అయితే ఈసారి దసరా పండగకు ఓట్ల పండగ తోడవడంతో ఈ రెండింటి ఎఫెక్ట్ తో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తామనుకున్న రాజకీయ నేతలు దసరా పండగను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలకు పదునుపెట్టారు. కొన్ని చోట్ల ఇంటిల్లిపాదికి సరిపోయే దసరా పండుగ ఖర్చులు తామే భరిస్తామని తమ అనుచరుల ద్వారా సమాచారం చేరవేసిన నాయకలు.. ఇచ్చిన మాట ప్రకారం యాటకూర, లిక్కర్ పంపిణి చేసి ప్రజలను చిల్ చేసేశారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ముక్క, చుక్క దావత్ లతో అదరగొట్టేశారు. జనాలు సైతం ఫ్రీగా వచ్చిన మందు, మటన్ తో దసరా సరదా తీరిందనే రేంజ్ లో ఎంజాయ్ చేసేశారనే టాక్ వినిపిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పండగను లీడర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
మొన్నటి వినాయక చవితి నుంచే తాయిలాలు షూరూ చేసిన నాయకులు. వాటిని కంటిన్యూ చేస్తున్నారు. వినాయకచవితి ఉత్సవాలకు భారీగా విరాళాలు ఇచ్చిన నేతలు.. దసరాకు మాత్రం పెగ్గులతో ముంచెత్తారు. ముఖ్యంగా చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం గ్రామాలకు దూరంగా ఉంటున్న యువకులపై ఈసారి ఫోకస్ పెట్టారు. వారంతా పండగ కోసం గ్రామాలకు రావడంతో ఇప్పుడే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. యువకుల కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తమపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు యువతను మచ్చిక చేసుకునేందుకు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖరీదైన బ్రాండ్ల మందుతో పాటు తిన్నంత యాట కూరను పంపిణీ చేసి వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు జోరుగా సాగాయనే చర్చ రాజకీయవర్గాల్లో గుప్పుమంటోంది.జనాన్ని తమవైపు తిప్పుకునేందుకు దసరా పండగను మంచి అవకాశంగా భావించిన నేతలు.. ప్రీ ప్లాన్డ్ గా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది.
ముందుగానే లిక్కర్ లోడ్ లను యాటల కోసం గొర్రెలు, మేకలు, కోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన నేతలు.. వాటిని పండగ నాడు తమ ముఖ్య అనుచరుల ద్వారా ప్రజలకు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల పండగ ఏర్పాట్లపై ఎన్నికల కోడ్ ఆటంకంగా మారిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికల కోడ్ తో బెల్ట్ షాప్ లు అందుబాటులో లేకపోవడంతో కొన్నిచోట్ల ఆశించినంత మద్యం దక్కలేదనే విమర్శలు కూడా వినిపించాయి. మొత్తంగా దసరా పండగ నేతల చేతి చమురు వదిలించగా.. సామాన్య ప్రజలకు మాత్రం సరదా తీర్చిందనే వాదన వినిపిస్తోంది. ఖర్చు తడిసి మోపెడు అవుతున్నా గెలుపు కోసం వెనుకాడని నేతల ఆశలు నెరవేరుతాయా లేక అడియాశలు అవుతాయా అనేది డిసెంబర్ 3న తేలనుంది