ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యాంశాలు

జల జగడం

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాజెక్టుల వద్ద తీవ్ర ఉద్రిక్తత

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు.

అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్‌ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్‌ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్‌ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.  కాగా సాగర్‌ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు.

పులిచింతలలో వినతిపత్రం అందజేత
మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ  ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్‌ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్‌ఈ రమేష్‌ బాబు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్‌ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. 

చెక్‌పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు..
కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు.