తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 53 రోజులకు జైలు నుంచి బయటకు వచ్చారు. 53 రోజుల కిందట రాజకీయ పర్యటనలో ఉన్న ఆయనను కర్నూలులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు. ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేదు. చివరికి అరెస్టు చేసిన తర్వాత స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు అని చెప్పి కోర్టులో ప్రవేశ పెట్టారు. అప్పట్నుంచి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ క్వాష్, బెయిల్ పిటిషన్లపై విచారణలు జరుగుతున్నాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రావడంతో బయటకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉంది. ఇదంతా న్యాయపరమైన పక్రియ. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయంగా కార్నర్ అయ్యారా లేకపోతే మరింత బలపడ్డారా అన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కని విషయం.చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ట్రెండింగ్ చేశారు.
భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సీఐడీ వెంటనే కోర్టుకు వెళ్లి ఎలాంటి ర్యాలీలు చేయకుండా ఆదేశాలు తీసుకు వచ్చింది. కేసు గురంచి మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే ఉండవల్లి నివాసానికి వెళ్లే ప్రతీ చోటా.. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ చాలా నెమ్మదిగా సాగింది. ప్రజా స్పందన చూసి టీడీపీ నేతలు సంతోషపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల టీడీపీకి మేలే జరిగిందని టీడీపీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో టీడీపీకి మరింత మేలు చేసేలా పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుండి ప్రపంచంలో తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నైల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. యాభై రెండు రోజుల పాటు వీటిని కొనసాగిస్తూనే ఉన్నారు.
చివరికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత కూడా గచ్చిబౌలి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారు. స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. ఇలా ఏ కార్యక్రమం నిర్వహించినా చంద్రబాబుకు మద్దతుగా.. సంఘిభావం భారీగా ఉండేలా చూసుకున్నారు. రోజులు గడుస్తున్నా.. ఆ ప్రదర్శనలు కొనసాగాయి. నిజానికి చంద్రబాబు బయట ఉంటే.. సైబరాబాద్ ను నిర్మించానని పదే పదే చెప్పుకునేవారు. కానీ ఆయన జైల్లో ఉండటం వల్ల .. ఇలాంటి ప్రచారం ఐటీ ఉద్యోగులు చేశారు. చంద్రబాబు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు తెలిసేలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చివరికి గచ్చిబౌలిలో జరిగిన సీబీఎన్ గ్రాటిడ్యూడ్ సభ కూడా.. చంద్రబాబు హయాంలో నిర్మించిన స్టేడియంలోనే జరిగింది. ఇలా ప్రతి అంశం .. చంద్రబాబు దూర దృష్టి వల్లనే తెలుగు రాష్ట్రాల్లో సంపద సృష్టి జరిగిందని.. కొత్త తరానికి కూడా తెలిసేలా చేయగలిగారన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన అధికారంలో లేక ఇరవై ఏళ్లు అయినా చంద్రబాబు ముద్ర కనిపించేలా చేసుకోగలిగారు.
ఇదే విషయాన్ని బలంగా యువ ఓటర్ల దృష్టిలోకి తీసుకెళ్లగలిగారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు 73 ఏళ్ల చంద్రబాబును ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆయనను జైల్లోనే ఉంచి.. ఎన్నికలకు వెళ్లాలనుకున్నారని టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నారా లోకేష్ చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారంటీని ప్రారంభించాలనుకున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ మంత్రులు చేసిన వివాదాస్పద ప్రకటనలు, చంద్రబాబు మరణం, భువనేశ్వరి అరెస్టు అంటూ చేసిన ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతిని పెంచుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే.. ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా ఉండేవి కావు. లోకేష్ పాదయాత్ర చేసేవారు.
చంద్రబాబు భవిష్యత్ గ్యారంటీ సభలు పెట్టుకునేవారు. పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు కోసం ఇంకా సరైన కారణం కోసం వెదుకుతూ ఉండేవారు. అవన్నీ రాజకీయంగానే ఉండేవి. కానీ చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయం భిన్నంగా మారింది. ఇది టీడీపీకి మేలు చేసిందనేది ఎక్కువ మంది భావన