narendra
జాతీయం రాజకీయం

మరో ఐదేళ్లు ఉచిత రేషన్ పథకం

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పేదలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దీని ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆర్థిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తోందని.. తరచూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు.“కాంగ్రెస్ ఆత్మగౌరవం – ఆత్మవిశ్వాసం గల పేదలను ద్వేషిస్తుంది. పేదలు ఎల్లప్పుడూ తన ముందు నిలబడి వేడుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి అది పేదలను, పేదల్లానే ఉంచాలని కోరుకుంటుంది. కాబట్టి, ఇక్కడ అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసే ప్రతి పనిని ఆపడానికి తన శక్తిని ఉపయోగిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం.. అవినీతిని మీరు సహించారు. నన్ను నమ్మండి, కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మీరు ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు” అంటూ ప్రధానమంత్రి మోదీ హామీనిచ్చారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి మొత్తం సమాజాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తాను దుర్విని యోగాలకు భయపడనని.. అందరి అభ్యున్నతే లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.కాగా.. ప్రధాని మోదీ ప్రకటనలు రాజకీయ వేడిపుట్టించాయి. ఎన్నికలకు ముందు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. ఛత్తీస్‌గఢ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది