kcr-koinapalli
తెలంగాణ రాజకీయం

కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నసిఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు స్వాగతం పలుకగా, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసి.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకాలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసే ప్రతిసారి కేసీఆర్‌ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్‌ఎస్‌ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్‌, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వే స్తారు.

సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించారు.