ఈ ఏడాది వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక గడిచిన 1,25,000 ఏండ్లల్లో.. ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు యురోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోబర్‌లో నమోదు అయిన ఉష్ణోగ్రతల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2019లో నమోదు అయిన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది 0.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అయినట్లు ఈయూ కోపర్‌నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ సమంత బుర్జెస్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో టెంపరేచర్లు అసాధారణంగా ఉన్నట్లు తెలిపారు.1850 నుంచి 1900 మధ్య ప్రపంచవ్యాప్తంగా వాయు ఉష్ణోగ్రతలను పోలిస్తే .. ఈ ఏడాది అక్టోబర్‌లో 1.7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు భావిస్తున్నారు. పారిశ్రామీకరణకు ముందు ఉన్న వాతావరణంతో ప్రస్తుత అంచనా వేశారు. దీంతో 2023ని హాటెస్ట్ ఇయర్‌గా పేర్కొన్నారు.
కోపర్నికస్ డేటా సెంటర్ 1940 నుంచి అందుబాటులో ఉన్నది. ఇక యూఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమెట్ చేంజ్ ఇచ్చిన డేటా ప్రకారం.. గడిచిన 1,25,000 ఏండ్లల్లో.. ఈ ఏడాది హాటెస్ట్ ఇయర్‌గా నమోదు అయినట్లు తెలుస్తోంది.గ్రీన్‌హౌజ్ వాయువులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు.. ఎల్‌నినో తోడవ్వడం వల్లే .. ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు రెట్టింపు అవుతున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ మాన్ తెలిపారు. అతి తీవ్రమైన వెదర్ వల్ల లిబియా లాంటి ప్రదేశాల్లో విధ్వంసకర రీతిలో వరదలు వస్తున్నాయి. దక్షిణ అమెరికా, కెనడాల్లో హీట్‌వేవ్‌కు కూడా ఇదే కారణం అవుతోంది.