తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను 53 నెలలుగా సొంత కాళ్లపై నిలబడకుండా చేశారంటూ విమర్శించింది. ఇప్పుడు బస్సు యాత్రల పేరుతో నయవంచన చేస్తున్నది నిజం కాదా ? అని నిలదీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీ హయాంలో జరిగిన లబ్ది, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయంపై లేఖలో ప్రస్తావించారు. రూ.3లక్షలు సబ్సిడీతో ఇచ్చిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసి, వాహన మిత్ర పేరుతో డ్రైవర్‌కు రూ.10వేలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజిల్, మద్యం రేట్లు పెంచి, పోలీస్, ఆర్టీవో జరిమానాలు, గ్రీన్ ట్యాక్స్ పెంచి ఒక్కో డ్రైవర్ నుంచి ఏడాదికి ఒక లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, ఎం.ఎ.షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ప్రస్తుతం వారి కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావులుగా ప్రచారం చేసుకుంటున్నారని లేఖలో విమర్శలు చేసింది. పేదల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారని, ఆదరణతో చేతి వృత్తుల వారికి పనిముట్లు అందించి ఆదాయం పెంచే పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. మటన్ మార్టులు, చేపల కొట్లు, 217 జీవోతో చేతి వృత్తుల వారి ఉపాధిని దెబ్బతీస్తున్నారని, పారిశ్రామిక రాయితీలు నిర్వీర్యం చేశారని మండిపడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా ? అని టీడీపీ పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కడం నిజం కాదంటారా ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా ? 1.42 లక్షల బ్యాక్ లాగ్ పోస్టుల్ని భర్తీ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఉద్యోగాలు దూరం చేయడం కుట్ర కాదా ? అని టీడీపీ నిలదీసింది.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్లు కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్లి చీవాట్లు తిన్నది వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ రద్దు చేశారని, చివరికి విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్‌ను అవమానించడం నిజం కాదంటారా అని లేఖలో ప్రస్తావించింది. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఇసుక ధరలు పెంచి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని మండిపడింది. ధరలు, పన్నులు మోత మోగిస్తూ ఒక్కో కుటుంబంపై రూ.2.78 లక్షల భారం మోపారని, ధరలు, ఛార్జీల బాదుడుకు అధికంగా కుంగిపోతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాదా ? అంటూ టీడీపీ నేతలు నిలదీశారు. మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి, కల్తీ మద్యంతో జేబులు గుల్ల చేశారని, 40 లక్షల మంది ఆరోగ్యాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.