అమెరికా కుబేరుల మధ్య స్పేస్ వార్ తీవ్రమవుతోంది. అంతరిక్షంలోకి వెళ్లడానికి అమెజాన్ ( Amazon ) ఫౌండర్ జెఫ్ బెజోస్ ( Jeff Bezos ) ప్లాన్ చేయగా.. ఆయన కంటే ముందే అక్కడికి వెళ్లడానికి వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. బ్రాన్సన్‌తో కలిసి ఓ తెలుగమ్మాయి బండ్ల శిరీష ( Bandla Sirisha ) కూడా స్పేస్‌లోకి వెళ్లబోతోంది.
ఇంతకీ ఎవరామె?
ఆమె పేరు బండ్ల శిరీష ( Bandla Sirisha ). ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆమె.. కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడామె విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్తే.. కల్పనా చావ్లా తర్వాత ఇండియాలో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టిన రెండో మహిళగా నిలుస్తారు.
శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి వచ్చారు. ఈ మధ్యే 747 ప్లేన్ ఉపయోగించి అంతరిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ ఆపరేషన్స్‌ను కూడా చూసుకుంటోంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. తానాలోనూ శిరీష యాక్టివ్‌గా వ్యవహరించారు.
రెండో మహిళ.. నాలుగో ఇండియన్
ఇప్పుడు శిరీష ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో భారతీయ మహిళ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఇండియన్. మన దేశం తరఫున రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి కాగా.. కల్పనా చావ్లాతోపాటు మరో ఇండియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కూడా ఈ ఘనత సాధించారు.
మరో ఐదుగురితో కలిసి..
ఈ నెల 11న తమ తర్వాతి టెస్ట్ ఫ్లైట్ లాంచ్ చేయబోతున్నట్లు గురువారం వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఇందులో మొత్తం ఆరుగురు ప్రయాణించనుండగా.. వీళ్లలో కంపెనీ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఒకరు కావడం గమనార్హం. న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన రాకెట్ షిప్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగుల పూర్తిస్థాయి క్రూతో అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి స్పేస్‌షిప్ ఇది. ఇది పది నిమిషాల పాటు స్పేస్‌లో ఉండనుంది. అందులో మూడు నిమిషాల పాటు అందులోని వాళ్లు అసలు బరువు లేని స్థితిని ఎదుర్కోనున్నారు.
బెజోస్‌కు పోటీగా..
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఈ నెల 20న అంతరిక్షంలోకి వెళ్తున్నారని బ్లూ ఆరిజిన్ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ బ్లూ ఆరిజిన్‌లో బెజోస్‌తోపాటు ఆయన సోదరుడు, మెర్క్యూరీ 13 సభ్యుల్లో ఒకరైన వాలీ ఫంక్‌ను గౌరవ అతిథిగా తీసుకెళ్లనున్నారు. అంతరిక్షంలోకి వాణిజ్య స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపడానికి అమెజాన్, వర్జిన్, స్పేస్ఎక్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి