jc-bros
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జేసీ బ్రదర్స్ కు చావో, రేవో..

ఉమ్మడి అనంతపురం జిల్లా  తాడిపత్రి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది జెసి బ్రదర్స్. తాడిపత్రి నియోజకవర్గం లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం జేసీ కుటుంబానిదే అవుతుంది.  అటువంటిది 2019 ఎన్నికల్లో  ఆ కుటుంబం ఓడిపోయింది.  తాడిపత్రి అసెంబ్లీలో  వైయస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో జేసీ  ప్రభాకర్ కుమారుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు.  ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో  జేసీ కుటుంబం తాడిపత్రిలో  కోల్పోయిన పట్టును సాధించాలని ఎంతో పట్టుదలగా ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దవడుగూరు మండలం జెసి కుటుంబానికి ఎంతో పట్టున్న ప్రాంతం. ఈ మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉండటమే కాకుండా చాలా కాలంగా జేసి దివాకర్ రెడ్డి వెంట వీరందరూ నడిచేవారు. వైఎస్ఆర్సిపి నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలంలో మండలాల వారీగా పట్టు సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు.

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు దగ్గర అయేందుకు ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధికారంలో ఉండి కూడా.. ప్రతిపక్ష నేత లాగా పాదయాత్ర చేస్తూ జనం మధ్యలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. జగనన్న సురక్ష, గడపగడపకు వైసిపి ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేలా ఆయన కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు. గ్రామాల్లో కంటే తాడపత్రి టౌన్‌లో జేసీ కుటుంబం  ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ  పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. తాడిపత్రి లో గడచిన మున్సిపల్ ఎన్నికల్లో  టీడీపీ విజయం సాధించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ  ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణంలో  జేసీ కుటుంబానికి ఎంత పట్టు ఉందో ఈ విజయంతో అందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం మండలాల వారీగా గ్రామాలలో  కుటుంబం పట్టు సాధించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రామాల్లో పట్టు సాదించేందుకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. గత  ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో తమ వారసులను ఎన్నికల బరిలో నిలిపారు.

జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జెసి పవన్ రెడ్డిని అనంతపురం పార్లమెంటుకు, జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డిని తాడపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  అధికారం కోల్పోయాక నాలుగున్నర సంవత్సరాలు కాలంలో కొన్ని రోజులపాటు దివాకర్ రెడ్డి అనారోగ్యంతో వివిధ కారణాలవల్ల నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పూర్తిస్థాయిలో దివాకర్ రెడ్డి రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతూన్నారు. దివాకర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి.  దివాకర్ రెడ్డి అంటే నియోజకవర్గం లో ప్రజలకు అమితమైన గౌరవం మర్యాద ఇస్తారు.  పెద్దవడుగూరు మండలంలో పట్టు నిలుపుకునేందుకు జేసీ  బ్రదర్స్ తో పాటు అస్మిత రెడ్డి ముగ్గురు ఓ సమావేశానికి హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దవడుగూరు మండలంలో తీవ్ర వర్షాభావం కారణంగా నీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.

పెద్దవడుగూరు మండలంలోని హెచ్ ఎల్ సి కింద సాగుతున్న పంటకు నీరు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతులతో ఉద్యమం చేసేందుకు వివిధ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు తో పాటు స్థానిక రైతులు ప్రజలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఉన్న అన్ని మండలాల్లోనూ జేసీ బ్రదర్స్ తో పాటు జేసీ అస్మిత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.  పరిస్థితులను బట్టి మండలాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని జెసి కుటుంబం దృఢ సంకల్పంతో ఉంది.

తాడిపత్రిలో బలం లేకపోతే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో మొత్తం కుటుంబం  జనం మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉండేందుకు తనదైన శైలిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నారు