తెలంగాణ ముఖ్యాంశాలు

పులిచింతల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు

పవర్ ప్లాంట్ లోపలకు కేవలం జెన్కో అధికారులకు మాత్రమే అనుమతి

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు పవర్ ప్లాంటు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్లాంట్ లోపలకు జెన్కో ఉద్యోగులు మినహా మరెవరినీ అనుమతించడం లేదు. మరోవైపు జెన్కో అధికారులు మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం 4,600 క్యూసెక్కుల నీటిని మాత్రమే వినియోగించుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని… ప్రాజెక్టు నుంచి 7,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టులోకి 39,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 160.20 అడుగులకు చేరుకుంది. ఇక్కడున్న రెండు యూనిట్ల ద్వారా 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

మరోవైపు జూరాలకు వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ ఫ్లో 4,500 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో 4,160 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317.56 మీటర్లుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 7.759 టీఎంసీల నీరు ఉంది.