jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ నేతల్లో… కొంప ముంచేది ఎవరు…

అమరావతి రాజధానిని దుంప నాశనం చేశారని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు భగ్గుమంటున్నాయి. ప్రకాశంలో విభేదాలు.. నెల్లూరులో ఫిరాయింపులు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉపశమన చర్యలు తీసుకోలేదని ఉడుకుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావంతో ఎన్ని సీట్లు గల్లంతు అవుతాయోనన్న ఆందోళన. విశాఖలో భూదందాలు, ఉక్కు ప్రైవేటీకరణపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపకుండా అధికార వైసీపీ ప్రజల మద్దతు కూడగట్టడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవేమీ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా జనం ఆలోచనలను కట్టడి చేయడం సాధ్యపడుతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ నేతల్లో ఈ అంశాలు గుబులు రేకెత్తిస్తున్నాయి.గత ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా చేసేందుకు నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్జగన్అంగీకరించారు.

రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేందుకు సొంతిల్లు కూడా కట్టుకుంటున్నానని ప్రకటించారు. అధికారానికి వచ్చాక మూడు రాజధానుల పల్లవి ఎత్తుకున్నారు. హైకోర్టు అక్షింతలు వేసేసరికి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజధాని పేరుతో ఒకేచోట లక్ష కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని ఇప్పుడు చెబుతున్నారు.దీంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజలు జగన్ సర్కారుపై భగ్గుమంటున్నారు. తాడికొండ, మంగళగిరిలాంటి నియోజకవర్గాల్లో నష్ట నివారణ కోసం పేదలకు ఇళ్లంటూ ఓ యాభై వేల కుటుంబాలను దరిచేర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ జిల్లాల్లో విజయం సాధించడానికి ఏం చేయాలో అర్థంగాక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బంధువుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముఖాలు మార్చి బరిలోకి దించినా గెలుస్తామనే ధీమా కనుచూపుమేర కనిపించడం లేదు. పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలో ఈపాటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇక్కడా పరిస్థితులు ఆశాజనకంగా లేవు.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవుతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో ఈ జిల్లాల్లో వైసీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది.ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితులు అనుకూలంగా లేవు. టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఎన్ని సిట్టింగ్స్థానాలు ఎగిరిపోతాయోనన్న బెంగ పట్టుకుంది. జనసేన ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రధానంగా పోలవరం ఎఫెక్టు తప్పదని అంచనా వేస్తున్నారు.విశాఖను రాజధానిగా చేస్తామని ఎన్ని సంకేతాలిస్తున్నా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఆశించిన సానుకూలత వ్యక్తం కావడం లేదు. దీనికితోడు స్టీల్ప్లాంటు అమ్మకాన్ని అడ్డుకోలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతతకు పేరుగాంచిన విశాఖ నగరం భూదందాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని జనంలో ఆందోళన నెలకొంది. రానున్న ఎన్నికల్లో ఈ అంశాలన్నీ ప్రభావం చూపితే పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్ ఏం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.