kavitha
తెలంగాణ రాజకీయం

అమిత్ షా కాదు…అబద్దాల బాద్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు. తెలంగాణ కుటుంబంలోకి వచ్చి ఆ నాయకులు వైరుధ్యాలు సృష్టించలేరని, గొడవపెట్టలేరని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవని, గత పదేళ్లో ఎటాంటి అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా ? అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు.కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అమిత్ షా అన్నారని, ఎయిర్ ఇండియా వంటి పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తదటా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా ప్రకటన కనీసం నమ్మేటట్టు ఉందా అని అడిగారు. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల టౌన్‌లో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కవిత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు బయటి వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని కాని తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని   అన్నారు.