తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికే సిబ్బంది చేరుకొని తమకు కేటాయించిన సామగ్రిని కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే వారి కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దే ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఫెసిలిటీ సెంటర్‌లో కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అక్కడే ఎన్నికల సామగ్రి కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఏర్పాటు చేసిన వెహికల్స్‌లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని చేరవేసేందుకు ఉంచిన వాహనాలకు ముందే రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ ప్రకారమే వెహికల్స్ మూమెంట్ ఉంటుంది. వేరే దారిలో వెళ్లే పరిస్థితి ఉండకూదు. మార్గ మధ్యలో ఆప కూడదని కూడా ఆదేశాలు ఉన్నాయి. వాటికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందని ఏ జరుగుతుందో స్పష్టంగా తెలిసిపోతుందని ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులు అక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు.
ఉదయం ఐదున్నరకు మాక్ పోలింగ్ ఉదయం ఐదున్నరకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆటైంకు అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను టచ్ చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందరి సమక్షంలో మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం ఏడు గంటలకు సాధారణ పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు మిగతా ప్రాంతాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసుకునే హక్కు ఉంటుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారు విజయవంతంగా ఓటు వేసి వెళ్లేందుకు వీలుగా 21 ,686 వీల్‌ఛైర్లు ఏర్పాటు చేసింది.
80 ఏళ్లుపైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తోంది. ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు పంపిణీ చేసింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపి ఉన్న ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 120పైగా కేంద్రాలను దివ్యాంగులే నిర్వహించనున్నారు. మరో ఆరువందల కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 375 కంపెనీల సాయుధ బలగాలు, 50వేల మంది స్థానిక పోలీసులను ఎన్నికల సంఘ వినియోగిస్తోంది. ఓటరు స్లిప్‌లను మాత్రం గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోమని… ఓటరు ఐడీ కానీ వేరే ఇతర 12 రకాల ఐడీలు కానీ ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు స్లిప్పులపై ఎలాంటి గుర్తులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. అలాంటి వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని లేకుంటే తిరస్కరిస్తామని పేర్కొంది. ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు సెల్ఫీలు, ఇతర ఫొటోలు తీయడానికి కూడా వీల్లేదని చెబుతున్నారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు.
బందోబస్తుకు 150 కోట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో కనివిని ఎరుగని రీతిలో చర్యలు చేపట్టింది. ఎంత వ్యయమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. చీమ చిటుక్కుమన్నా వాలిపోయే భద్రతా బలగాలు. ఘర్షణలకు తావులేకుండా పటిష్టమైన పహారా. కేవలం ఎన్నికల బందోబస్తు కోసమే ఎన్నికల కమిషన్ అక్షరాల 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందట..తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119. ఇందులో సమస్యాత్మకమైనవి 106. పోలింగ్ కేంద్రాలు 35,655. ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను వినియోగిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు ఏకంగా 150 కోట్లు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. ఈ ఎన్నికల్లో కేవలం బందోబస్తు ఖర్చు రూ. 150 కోట్లు.. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బలగాలతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోలీసుల అలవెన్సులు, వాహనాలకు రూ.150 కోట్ల వరకు ఖర్చు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. గత ఎన్నికల్లో మొత్తం రూ.100 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి… ఫలితాలు వెలువడే వరకు పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో తనిఖీల కోసం 373 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి పారామిలటరీ బలగాలు ఇలా ఖర్చు పెరుగుతూ పోయింది.