cong-bjp
జాతీయం రాజకీయం

ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాతే

దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ వేవ్‌తో ఒక్కసారిగా నీరసపడిపోయింది. వరుసగా అన్ని చోట్లా అధికారం కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక మాత్రమే. మిగతా అన్ని చోట్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీ హవానే కొనసాగుతోంది. వారసత్వ రాజకీయాలు అన్న మరక చెరుపుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడడం లేదు. అందుకే అధ్యక్ష పదవిని మల్లికార్జున్ ఖర్గేకి అప్పగించి కొంత వరకూ తమపై ఉన్న ఆ మచ్చని తొలగించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. అయినా సరే…ఖర్గే ఓ కీలుబొమ్మ అని ప్రచారం చేస్తున్నాయి మిగతా పార్టీలు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ పోటీ చేసినా చావోరేవో అని పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పార్టీకి. ఇంత కష్టకాలంలో కాంగ్రెస్‌ని ఆదుకుంది కర్ణాటక. సౌత్‌లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఒకే ఒక రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బీజేపీతో ప్రత్యక్ష యుద్దం చేస్తున్న సమయంలో ఈ విజయం కాంగ్రెస్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది.

దాదాపు పట్టు కోల్పోతోందన్న సమయంలో కర్ణాటకను గెలుచుకోవడం సానుకూల సంకేతాలిచ్చింది. అధికారంలోకి వచ్చిన తరవాత పరిపాలన ఎలా ఉంది..? ఎంత వరకూ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నది తరవాత సంగతి. ముందైతే ఆ అధికారం సాధించుకోవడమే కీలకం. ఈ విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్ అయింది. ఇదే సక్సెస్ ఫార్ములాని ఇకపైనా కొనసాగించాలని చూస్తోంది. ఇక్కడ మరో విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. అందుకు కారణం రాహుల్ గాంధీ. అంతకు ముందు రాహుల్ ప్రత్యక్ష రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదన్న విమర్శలొచ్చాయి. కానీ…ఉన్నట్టుండి ఆయన తెరపైకి వచ్చారు. సీనియర్లందరూ  రాజీనామాలు చేస్తున్న సమయంలోనే పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అసలు ఆయన వల్లే సీనియర్‌లు బయటకు వెళ్లిపోయారన్న వాదనలూ వినిపించాయి. కానీ రాహుల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. భారత్ జోడో యాత్రతో పార్టీ గ్రాఫ్ కొంత వరకూ పెంచగలిగారు.

ఆ ప్రభావం కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చాలా స్పష్టంగా కనిపించిందన్నది నిపుణుల విశ్లేషణ. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఆ పార్టీకి మరో పరీక్ష పెట్టాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, మిజోరం, తెలంగాణ, రాజస్థాన్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కాంగ్రెస్‌కి కాస్త పాజిటివ్ వేవ్ కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రాజస్థాన్‌లో మాత్రం అధికారం కోల్పోయే అవకాశముందని అంచనా వేశాయి. మిజోరం సంగతి పక్కన పెడితే మిగతా నాలుగు రాష్ట్రాల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గ్రాఫ్‌ పడిపోతుందన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. అఫ్‌కోర్స్..ఫలితాలు వస్తే తప్ప ఈ అంచనాలు నిజమా కాదా అన్నది తేలదు. కానీ ఇప్పటికి జస్ట్ అనలైజ్ చేసుకోడానికి మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పనికొస్తాయి. 2024 లోక్‌సభ ఎన్నికల  ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఫోకస్ మరింత పెరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే కాంగ్రెస్‌కి ఇవి సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ ఎలక్షన్స్‌లో కాస్త గట్టిగా నిలబడితే కానీ లోక్‌సభ ఎన్నికలకు కొంత బూస్ట్ వస్తుంది.

అన్ని ఫలితాలపైనా భారీ అంచనాలే పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కాకపోతే…మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఏ మేరకు రాణించగలుగుతుందన్నదే ఇక్క అత్యంత కీలకం. మధ్యప్రదేశ్‌లో కొంత వరకూ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది కాంగ్రెస్‌కి ఏ మేరకు మేలు చేస్తుందన్నది చూడాలి. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అంతర్గత కలహాలతో సతమతమైంది. ఈ కారణంగానే కొంత వరకూ నమ్మకం కోల్పోయిందన్నది పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తున్న వాదన. 1998 నుంచి రాజస్థాన్ ఎలక్షన్ సినారియోని గమనిస్తే…కాంగ్రెస్ ఎప్పుడూ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసారి గెలిస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్ తెగల జనాభా దాదాపు 21%గా ఉంది. అన్ని పార్టీల దృష్టి వీరిపైనే. అయితే…దేశంలో వెనకబడిన వర్గాలపై ఎక్కువగా దాడులు జరుగుతున్న రాష్ట్రంగా కొంత చెడ్డ పేరు తెచ్చుకుంది మధ్యప్రదేశ్. ఇది బీజేపీకి కొంత వరకూ నష్టం కలిగించే అవకాశముంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ గట్టిగానే ప్రచారం చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతనే అస్త్రంగా మలుచుకుంది. కానీ ఈ అస్త్రం పని చేసిందా లేదా అన్నది తేలాలి.

తెలంగాణలోనూ కాంగ్రెస్‌కి కొంత సానుకూలత ఉన్నట్టే కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 24 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేశాయి. వీటిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ అన్ని పార్టీలనూ సమన్వయం చేసుకునే బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఈ కూటమిని లీడ్ చేస్తుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఒకవేళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కి సానుకూలంగా ఉంటే అప్పుడు ఈ కూటమి స్ట్రాటెజీ కూడా మారిపోయే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ముందుండి మిగతా పార్టీలను నడిపించొచ్చు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగితే మిగతా పార్టీలూ విభేదాలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలోఎన్డీయే  పై పోరాడేందుకు సహకరించే అవకాశాలనూ కొట్టి పారేయలేం. ఫైనల్‌గా ఇది కాంగ్రెస్‌కే మేలు చేస్తుంది. లోక్‌సభ ఎన్నికలపైనా ఇది ప్రభావం చూపిస్తుంది. కాంగ్రెస్‌కి కావాల్సింది ఇదే. ఎదురే లేకుండా దూసుకుపోతున్న బీజేపీకి పగ్గాలు వేయాలని చూస్తోంది. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లోనూ రాణించగలిగితే కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని గట్టిగా ప్రచారం చేసుకోడానికీ అవకాశం వస్తుంది.

ఆ అవకాశం ఈ సారే రావాలని ఆకాంక్షిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వస్తే ఇండియా  కూటమి పరిస్థితేంటన్న ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అదే పరిస్థితి వస్తే కాంగ్రెస్‌ పార్టీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు మిగతా పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నదీ అనుమానమే. అప్పుడు ఎన్డీయే మరింత బలపడుతుంది. ప్రజలకు బీజేపీ తప్ప మరో ఆప్షన్ లేదన్న సంకేతాలూ వెళ్తాయి. ఇది ఆ కూటమిలోని అన్ని పార్టీలకూ నష్టం కలిగించే ప్రమాదముంది. అందుకే…చివరి వరకూ ఈ కూటమి చీలకుండా ఉంటుందా అన్నదీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయన్నది కొందరి అనాలసిస్.