- వర్గీకరణ బిల్లు పెట్టాలని దళితుల ఆందోళన
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద సభకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిరసన సెగ తగిలింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలు, ఉప కులాలకు హామీ ఇచ్చి ఓట్లు దండుకుని మోసం చేశారని దళితులు ఆందోళన చేశారు. కిషన్‌రెడ్డి తొర్రూరుకు చేరుకుని ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేశ్, చెర్లపాలెం గ్రామానికి చెందిన రిసెర్చ్ స్కాలర్ ధర్మారపు నాగన్నతోపాటు మరికొందరు దళిత యువకులు.. మోదీ, కిషన్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణకు మోక్షం కల్పించకుండా బీజేపీ నేతలు మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ‘వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఏమైంది?, ఎన్డీయే ప్రభుత్వం.. మోదీ, కిషన్‌రెడ్డి గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వర్గీకరణపై కేంద్రం తాత్సారం చేస్తే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.