వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఉత్తరాంద్ర వెనుకబాటు తనం గుర్తుకొచ్చిందా జగన్మోహన్‌రెడ్డి…? మీ రాజధాని మాకొద్దు మహాప్రభో.. మా విశాఖలో మునుపటి ప్రశాంతతను మిగల్చాలని విశాఖ వాసులు వాపోతున్నారు. గౌరవ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన తీర్పు ను గౌరవించకుండా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమి వచ్చింది.
చట్ట పరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను జగన్ ఎంచుకున్నారు.విశాఖ ప్రజలు చాలా తెలివైన వారు.. మీ మాటలను నమ్మే పరిస్థితిలో లేరు.. మీరు చేస్తున్న మోసాన్ని విశాఖ వాసులు పసిగట్టేశారు. 2024 లో మీ ప్రభుత్వ పతనం ఇదే విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి’’ అని గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.