saripella rajesh
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పోటీ నుంచి విరమించుకుంటా

” కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు  ” అంటూ పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు. సహజంగా ఇది రాజకీయ  నాయకులు వాడే అస్త్రమే. సరిపెల్ల రాజేష్ మహాసేన పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కులానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మొదట్లో ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆ తర్వాత 2014లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.  అంతకు ముందే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలను ఎవరూ ప్రశ్నించలేదు. తర్వాత మహాసేన రాజేష్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. తాను ఆ పార్టీలో లేనని చెప్పారు. ఈ క్రమంలో దళితులపై జరుగుతున్న దాడులు.. ఇతర అంశాలపై పోరాటం చేశారు.

చివరికి ఆయన తెలుగుదేశం  పార్టీలో చేరారు. ఆ పార్టీ కోసం విస్తృతంగా శ్రమించారు. దీంతో ఆయనకు పి.గన్నవరం టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. అయితే ఇప్పుడు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొంత మంది తెరపైకి తెచ్చి పవన్  కల్యాణ్ తో పాటు చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పైనా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. కొంత మంది జనసేన కార్యకర్తల పేరుతోనూ ఇటీవల పి. గన్నవరంలో ఆందోళన చేశారు. ఆయనపై ఈ విమర్శల దాడి రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీ కి చెందిన సోషల్ మీడియా ఖాతాలతో పాటు కొన్ని మీడియాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం  చేస్తున్నాయి. దీంతో  కిందిస్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతూంటే తట్టుకోలేకపోతున్నారని.. ప్రజల్లోకి  తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియో చేసినట్లుగా తెలుస్తోంది.మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని.. కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు.. కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి ప్రజలకు చెప్పడానికే ఆయన వీడియో చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. మహాసేన రాజేష్ ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు.

ఈ పరిణామాలు.. రాజేష్ కు మరింత సింపతీ పెంచుతాయని టీడీపీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు, లోకేష్,  పవన్  కల్యాణ్ .. పూర్తి స్థాయిలో రాజేష్ కు సహకారం అందిస్తారని.. ఆయన పోటీలో ఉండకపోవడం అన్న ప్రశ్నే ఉండదని అంటున్నారు. నిజంగా మహాసేన రాజేష్.. వైసీపీ నేతలు ఇతర విమర్శల వల్ల పోటీ నుంచి విరమించుకుంటున్నానన్న ప్రకటన చేస్తే.. దళిత వర్గాలు  వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయని అంటున్నారు.