ap-cong
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ ఆశలు ఫలించేనా

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ పాలనా, అక్కడి రాజకీయాలు భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి  ఏపీపై పడింది. ఏపీలో ఎవరు గెలుస్తారన్న అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఊహించని విధంగా  ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఓ ప్రయోగం చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని  అడగడం ప్రారభించారు. అదే సమయంలో తాము వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఖాయమని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు.  కానీ కాంగ్రెస్ రావాలంటే పార్టీని నడిపించేవారు కావాలి.  అలాంటి నేత కొరత షర్మిల తీర్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో లభించిన విజయంతో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో మరింత ఊపు వచ్చింది.  బీజేపీ చేతిలో ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని పోగొట్టుకుంటే… అసాధ్యమనుకున్న విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సాధించింది.  ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.  ఎందుకంటే..  ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కునే వెసులుబాటు వెతుక్కుంటూ  షర్మిల రూపంలో వచ్చింది మరి.

వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం ఆ పార్టీ వైపు మళ్లింది. ఇప్పుడు షర్మిల ద్వారా ఆ ఓటు  బ్యాంక్ ను  కాంగ్రెస్ వైపు రప్పించుకోవాలన్న ప్రణాళిక కాంగ్రెస్ అమలు చేస్తోందన్న అభఇప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అంతర్గత సంభాషణల్లో షర్మిల ఏపీలో కాంగ్రెస్ సారధ్యం వహిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు షర్మిల ఏపీలోపార్టీ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. మాజీ ఎంపీ చింతామోహన్ కూడా అదే చెబుతున్నారు. అయితే షర్మిల ఇప్పటికీ కాంగ్రెస్ లో లేరు.  అన్న జగన్మోహన్ రెడ్డితో విబేధాలు వచ్చాయో…  లేక రాజకీయ వ్యూహమో కానీ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేకపోయారు.  అందుకే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమవ్వాలనుకున్నారు. కానీ ఆమె చేరిక బీఆర్ఎస్ కు ఆయుధం ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని అంటారు.

అందుకే రేవంత్ పై షర్మిల విమర్సలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం అంతా రేవంత్ చుట్టే తిరుగుతోంది.  అంటే షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లోకి నో ఎంట్రీ అన్నమాటే.  షర్మిల రాజకీయ  భవిష్యత్ ను సీరియస్ గా తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనమయి.. ఏపీ లో  రాజకీయం చేయడం ఒక్కటే మార్గం.  రేవంత్ రెడ్డి కూడా గతంలో అదే చెప్పారు. షర్మిలను విలీనం చేసుకోవచ్చు కానీ.. ఆమె తన సొంత రాష్ట్రంలో రాజకీయం చేయాలని తాము కూడా సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. షర్మిల సొంత రాష్ట్రం అంటే ఏపీనే. ఎలా చూసినా ఇప్పుడు షర్మిల ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టడమే.  ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత మేరకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం వల్లనే క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డిపార్టీ వైసీపీతో వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన వల్లనే ఏపీలో కాంగ్రెస్ చతికిలపడిందని కొంత మంది  చెబుతారు.. కానీ   జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ భూస్థాపితమయిందనేది  నిజమని భావిస్తారు.  

ఇప్పుడు వైఎస్ వారసురాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాడానికి వస్తే..  కాంగ్రెస్ క్యాడర్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్న హైకమాండ్ షర్మిలతో ఇప్పటికే చర్చించిందని అంటున్నారు. . షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ ను చేసి   ప్రత్యేక హోదా నినాదంతో  ప్రచారం చేద్దామని..  అప్పుడు కాంగ్రెస్ వర్గాలన్నీ వెనక్కి వస్తాయని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారంటున్నారు. షర్మిలకు రాజకీయంగా బలం అందించడానికి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కూడా హామీ ఇచ్చారంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను షర్మిలకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయితే ఇప్పటికిప్పుడు అద్భుతాలే జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ కూడా అనుకునే అవకాశం లేదు. కానీ  కాంగ్రెస్ బలపడుతుంది. అధికారంలోకి రాకపోవచ్చు కానీ.. పూర్వ వైభవం దిశగా మొదటి అడుగు పడుతుంది.  అది జగన్మోహన్ రెడ్డికి సంకటంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది.

ఈ సారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా నినాదంతో కాంగ్రెస్ .. షర్మిల నాయకత్వంలో ఏపీలో అడుగు పెడితే రాజకీయాల్లో కీలక మార్పులు చేుకుంటున్నాయి.   రాజకీయాల్లో పోయిన చోటే వెదుక్కుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభిస్తుంది. మరి షర్మిల  రెడీ అవుతారా అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.వైపు జగన్, షర్మిల మధ్య రాజీ కుదిరిందని.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాకపోచ్చని మరో ప్రచారం కూడా జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్, షర్మిలలతో మాట్లాడి వారి మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీని సెటిల్ చేశారని అంటున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు. ఇదే నిజం అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రారు.  జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలే అవుతుంది.