nellore-drugs
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇంటర్ నెట్ చూసి ఇంట్లోనే డ్రగ్స్

నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని చాలాసార్లు పోలీసులు అరెస్ట్ చేశారు కానీ, ఈసారి ఈ కేసులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. వీళ్లు లోకల్ గానే డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్ చూసి డ్రగ్స్ తయారీ నేర్చుకున్నామని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ కేటుగాళ్లు అసలు నిజం చెప్పడంతో ఖాకీలు షాకయ్యారు. నెల్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కుటీర పరిశ్రమలాగా డ్రగ్స్ తయారీ మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. మత్తువదలరా అనే తెలుగు సినిమాలో ఓ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ తయారు చేస్తుంటారు. సరిగ్గా ఈ సినిమాలోని సీన్ నెల్లూరులో జరిగింది. నెల్లూరు రూరల్ మండలంలోని ధనలక్ష్మీపురం సామంతులవారితోపు, ఏవీరెడ్డి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ తయారీపై పోలీసులకు సమాచారం రావడంతో వారు సడన్ గా రైడ్ చేశారు. అక్కడున్న డంప్ చూసి షాకయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.సాత్విక్‌ అనే యువకుడు బీటెక్‌ చదివి పలు ఉద్యోగాలు చేశాడు. ఈజీ మనీకి అలవాటు పడి ఉద్యోగం వదిలేసి మోసాలకు అలవాటు పడ్డాడు.

గూడూరు రాజీపేటకు చెందిన శ్రీనివాసులు, మొగళ్లపాలేనికి చెందిన ఎం.బాబు, గూడూరు రైల్వేస్టేషన్‌ లో బిర్యానీ, టీ అమ్ముకునే కె.వెంకయ్య, వినోద్ తో ఓ ముఠాని ఏర్పాటు చేశాడు. నెల్లూరు బాలాజీనగర్‌ కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పి.వేణుగోపాల్‌ రెడ్డి అలియాస్‌ వేణురెడ్డి సూచన మేరకు డ్రగ్స్ తయారీ మొదలు పెట్టాడు సాత్విక్. నిషేధిత మత్తు పదార్థాలైన మెఫేడ్రోన్‌ లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, వాటిని తయారుచేసి తనకు ఇస్తే కమీషన్‌ ఇస్తానని సాత్విక్‌ కు వేణురెడ్డి చెప్పాడు. దీంతో ఈ మత్తుమందు తయారీ మొదలు పెట్టాడు సాత్విక్. డ్రగ్స్ ఎలా తయారు చేయాలనే విషయాన్ని సాత్విక్ ఇంటర్నెట్ లో వెదికి తెలుసుకున్నాడు. మత్తుమందు తయారీకి ఏయే పదార్థాలు కావాలో లిస్ట్ రాసుకున్నాడు. ఇంటర్నెట్ లోనే ఆర్డర్ ఇచ్చి రూ.2.60 లక్షలతో అవసరమైన మిషనరీని కొనుగోలు చేశాడు. అవసరమైన రసాయనాలను తిరుపతిలోని ఓ బయో సైంటిఫిక్‌ దుకాణంలో కొన్నాడు. తయారీ మొదలు పెట్టాడు. అయితే చుట్టుపక్కలవారికి వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. వారి ద్వారా విషయం పోలీసులకు చేరింది. పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. చివరకు అక్కడ ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్థారించారు.

సడన్ గా రైడ్ చేయడంతో అసలు బండారం బట్టబయలైంది. నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ డి.హిమవతి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఇన్‌ స్పెక్టర్‌ పి.శ్రీనివాసులురెడ్డి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, డ్రగ్స్‌ కంట్రోల్‌, రెవెన్యూ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.15లక్షల విలువైన 560 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 48 రకాల వస్తువులు, సెల్‌ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌ రెడ్డి మాత్రం పోలీసులకు దొరకలేదు. డ్రగ్స్‌ తయారీ కేంద్రంపై దాడి చేసి మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కేవలం డ్రగ్స్ రవాణా, వినియోగంపైనే కేసులు నమోదయ్యాయి. ఈసారి ఏకంగా డ్రగ్స్ తయారీ కేంద్రమే నెల్లూరులో బయటపడటంతో పోలీసులు షాకయ్యారు. ఇలాంటి కార్యకలాపాలు ఇంకెక్కడైనా జరుగుతున్నాయేమోనని ఆరా తీస్తున్నారు.