nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

లోకేష్ పాదయాత్ర… హిట్టా... ఫ్లాపా...

యువగళం పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి అలాంటి సువర్ణావకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని లోకేశ్‌ సద్వినియోగం చేసుకున్నారా..? లేదా..? అని అంచనా వేయలంటే యువగళం పాదయాత్రను చంద్రబాబు అరెస్టు ముందు, అరెస్టు తర్వాత అని రెండు భాగాలుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తాయి.చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్‌ సమరశంఖం పూరించారు. యువగళం వెబ్‌సైట్‌లో ఇప్పటికీ 400 రోజులు 4 వేల కిలోమీటర్లు అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది! అయితే లక్ష్యం పూర్తికాకుండానే, 227 రోజులలో 3132 కిలోమీటర్లు నడిచి పాదయాత్రను ముగించారు.డిసెంబర్‌ 20వ తేదీన భోగాపురంలో ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నారు. అంటే లోకేశ్‌ నిర్ణయించుకున్న 4 వేల కిలోమీటర్ల లక్ష్యానికి అనుగుణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లకుండానే పాదయాత్రను ముగిస్తున్నారు.

అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయకుండా హడావుడిగా పాదయాత్రను ముగిస్తూ ‘ఆంధ్రులు ఆరంభ శూరులు’ అనే మాటని లోకేశ్‌ నిజం చేస్తున్నారా అనిపిస్తోంది.పాదయాత్రకు ఆదిలోనే చిత్తూరు జిల్లాలో పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ, మైక్‌సెట్లను తొలగించినా, లోకేశ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఎన్ని ఇబ్బందులొచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పి పట్టువిడకుండా పాదయాత్రను కొనసాగించారు. అనంతపురం జిల్లాకు చేరేసరికి ఆయన మరింత రాటుదేలినట్టు కనిపించారు.అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేశారు. మీడియా దృష్టిని కూడా తనవైపు తిప్పుకోగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి పాదయాత్ర దోహదపడిందనే విశ్వాసం టీడీపీ కార్యకర్తల్లో కలిగింది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడులలో పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేసి, అధికార బలంతో తిరిగి టీడీపీ వారిపైనే కేసులు నమోదు చేసినా, వారి ప్రయత్నాలను తిప్పికొడుతూనే లోకేశ్‌ విజయవంతంగా ముందుకు సాగారు. పాదయాత్రలో భాగంగా డిసెంబర్‌ 17వ తేదీ వరకు యువనేత లోకేశ్‌ 70 బహిరంగ సభలలో పాల్గొన్నారు.

155 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద యువగళంలో లోకేశ్‌కు ప్రజల నుండి వారివారి సమస్యలపై 4353 వినతులందాయి.ఈ ఏడాది జూలైలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్‌ మాట్లాడుతూ ‘‘నేను శారీరికంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నాను. మరో 153 రోజుల్లో 2 వేల కిలోమీటర్లు సులభంగా పూర్తి చేయగలను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు. మధ్యలో పాదయాత్ర ఆపి కోర్టులో అటెండెన్స్‌ వేయించుకుని రావడానికి తన మీద కేసులు కూడా లేవని పరోక్షంగా జగన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అయితే కొద్ది రోజులకే పరిస్థితులు మారాయి. తన మీద కేసులు లేవని చమత్కరించిన లోకేశ్‌ చంద్రబాబు జైలుకెళ్లగానే పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. రెండు మూడు రోజులు ఆపితే పర్వాలేదు. కానీ, టీడీపీ కార్యకర్తల ఎదురు చూపులను పట్టించుకోకుండా రోజుల తరబడి ఢిల్లీ లోనే గడిపారు. చంద్రబాబు అరెస్టు అంశాన్ని లీగల్‌ టీంకి వదిలేసి పార్టీని ముందుండి నడిపిస్తూ, తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశాన్ని లోకేశ్‌ చేజేతులా పోగొట్టుకున్నారు. మొదటి విడతలో పాలపొంగులా సాగిన యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్టు తర్వాత రెండో విడతలో పార్టీ శ్రేణులు ఊహించినట్టు ఉత్సాహాన్ని నింపలేకపోయింది.

గతంలో జగన్‌, రేవంత్‌రెడ్డిని అధికార పార్టీలు జైల్లో పెట్టినా వారు అనుకున్న లక్ష్యం చేరుకున్నారు. వారిలాగే లోకేశ్‌ మీద కూడా వైఎస్‌ఆర్‌సీపీ కక్ష్య సాధింపు చర్యలు తీసుకొని ఉంటే ఆయన మహా అయితే, జైలుకు వెళ్లివచ్చేవారు. అది కూడా రాజకీయంగా ఆయనను మరో మెట్టు ఎక్కించేది! కానీ, లోకేశ్‌ అందివచ్చిన ఆయుధాలను వదిలేసి ఏపీ రణక్షేత్రాన్ని వదిలి ఢిల్లీ చుట్టూ తిరగడంతో ఆయన నాయకత్వంపై సందేహాలు పెరిగాయి. ఈ పరిణామాలు టీడీపీని చంద్రబాబు తప్ప మరెవ్వరూ కాపాడలేరని, ఆయన లోటును ఇంకెవ్వరూ పూడ్చలేరని క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకునే వరకు పరిస్థితి దిగజారింది. ఇప్పుడు యుద్ధం ముగిశాక కత్తి పట్టినట్టు పాదయాత్రను పున:ప్రారంభించిన లోకేశ్‌ పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయారు.
2003లో ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రలో దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 68 రోజుల పాటు 1600 కిలోమీటర్లు నడిచారు. మండుటెండలో రోజుకు సుమారు 24 నుంచి 28 కిలోమీటర్లు నడుస్తూ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నారు. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ‘వస్తున్నా మీకోసం’ అంటూ 208 రోజుల పాటు 2400 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 63 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వెరవకుండా, ఎక్కడా ఆపకుండా పాదయాత్ర చేశారు. విరామం లేకుండా పాదయాత్ర చేసిన ఈ మహానాయకులతో పోలిస్తే డిస్టింక్షన్‌ రావాల్సిన యువగళం పాదయాత్రకు కేవలం యాభై మార్కులు మాత్రమే పడతాయి.ఇచ్చాపురం వరకు వెళ్తానని చెప్పి మధ్యలో విరామాలు ఇస్తూ చివరికి ఆఘమేఘాల మీద ముగింపు పలకడం లోకేశ్‌కే చెల్లింది. జగన్‌ 341 రోజుల 3648 కిలోమీటర్ల ప్రజాసంకల్ప యాత్ర రికార్డును 400 రోజుల్లో బద్దలు కొట్టాలని బయలుదేరిన లోకేశ్‌ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా 227 రోజులకే చాప చుట్టేస్తున్నారు.

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప, హత్యలుండవని ఎంతోమంది నిరూపించినట్టే, లోకేశ్‌ కూడా దానికి అతీతం కాదనిపించారు.2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు, చంద్రబాబు తర్వాత పార్టీలో పట్టు సాధించడం..ఈ రెండు లక్ష్యాలతో లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర అయినా, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర అయినా ప్రతి రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యం అధికారమే! కానీ, పాదయాత్ర అధికార దాహంతో చేస్తున్నట్టుగా కనిపించకూడదు. ప్రజల ఇబ్బందులు, అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకోవడానికే అన్నట్టుగా సాగాలి. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత, నెలల తరబడి జీతాలు అందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఫించన్‌ అందని వృద్ధులు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ఇలా అనేకమంది పాదయాత్రలో తమ గోడు చెప్పుకుంటారు.వీరందరికీ భరోసానిస్తూ, ఆ అనుభవాల ఆధారంగా నాయకుడు తన మేనిఫెస్టోని, ప్రణాళికలను రూపొందించుకోవాలి. అధికార పక్షాన్ని తిట్టడానికే పరిమితం కాకుండా పరోక్షంగా సమస్యలను ఎండగడుతూ లోకేశ్‌ ఇలాగే నడుచుకున్నారా? అంటే.. పాదయాత్ర మధ్యలో వచ్చిన మహానాడులో తన దృష్టికి వచ్చిన అన్ని ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకోకుండానే మినీ మెనిఫెస్టో ప్రకటించారు. అంతేకాక టీడీపీ ప్రకటించిన మినీ మెనిఫెస్టోలోని అంశాలను కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు.

జగన్‌ ప్రభుత్వం కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టి, అభివృద్ధిని గాలికొదిలేసిందనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. దీనికి విరుగుడుగా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని అందించడానికి తమ దగ్గర ఎలాంటి ప్రణాళికలున్నాయో లోకేశ్‌ వివరించలేకపోయారు. అభివృద్ధికి ఎంత ఖర్చు చేయగలం? సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఖర్చుచేయగలరో అనే స్పష్టతను స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివిన లోకేశ్‌ ఇవ్వలేకపోయారు.వైఎస్సార్సీపీ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ యువతలో నిరాశ నెలకొందని, వారికి సరైన అవకాశాలు కల్పించి రాష్ట్రానికి యువశక్తితో నవశక్తి అందివ్వడానికే పాదయాత్రకు ‘యువగళం’ పేరు పెట్టినట్టు లోకేశ్‌ చెప్పుకున్నారు. కానీ, ఈ పాదయాత్రలో యువతను ఆకట్టుకునేలా ప్రణాళికలే ప్రకటించలేదు. పొలిటికల్‌ స్ట్రాటజిస్టులు, కనీసం విద్యార్థి ఎన్నికల్లో కూడా గెలవని వారి సలహాలతో పాదయాత్రను ఒక కార్పొరేట్‌ ఈవెంటులా మార్చేశారు.చంద్రబాబును కలిసిన తర్వాత రాజమండ్రి జైలు బయట జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తు ప్రకటించిన క్షణం నుంచి లోకేశ్‌ ప్రవర్తనలో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. 2014లో జనసేన అండతో గెలిచారు కాబట్టి, ఇప్పుడు కూడా ఈ పొత్తుతో టీడీపీ గెలుపు ఖాయమనే ధీమా లోకేశ్‌ మనసును కప్పేసింది.

ఆ ధీమాతోనే ఆయన మాటల్లో అహంకారం కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. తెలంగాణలో కేటీఆర్‌ ప్రదర్శించిన అహంకారమే బీఆర్‌ఎస్‌కి అధికారాన్ని దూరం చేసిందని ఆయన తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీని ఓడించడానికి కేవలం జనసేన మద్దతు సరిపోదు. చినుకు చినుకు కలిస్తేనే ప్రవాహం అయినట్టు, తెలంగాణలో కాంగ్రెస్‌లాగా చిన్నాచితక పార్టీలతో పాటు ప్రజా సంఘాలను కలుపుకుపోతేనే టీడీపీకి విజయం సాధ్యమవుతుందని లోకేశ్‌ గుర్తించాలి.పాదయాత్రలో నడుస్తూ ‘రెడ్‌ బుక్‌’ రాస్తున్నానని, ప్రజలను వేధిస్తున్నవాళ్ల చిట్టా తనవద్ద ఉందని లోకేశ్‌ చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా అంటున్నారు. కక్ష్య సాధింపులు లేకుండా ప్రజా సంక్షేమ, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన బీజేపీకి, దానితో అంటకాగే పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు.

నిజంగా తన పాదయాత్రలో ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని ఉంటే, లోకేశ్‌ నుంచి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చి ఉండేది.పాపులారిటీ, పాదయాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యలు, వాటిపై ప్రజలకు నాయకుడు ఇచ్చే భరోసా, పార్టీ భావజాలానికి, సిద్ధాంతాలకు సమీపంగా ఉండే పార్టీలను, సంఘాలను కలుపుకుపోవడం, మీడియా అటెన్షన్‌ లాంటి అంశాలు నాయకుడి ఎదుగుదలకు సోపానాలు. వీటిని పరిగణలోకి తీసుకుంటే లోకేశ్‌ పాదయాత్ర అనుకున్నంత ప్రభావం చూపలేదు. నాయకుడిగా, వ్యక్తిగతంగా లోకేశ్‌ కొంత పాపులారిటీ సొంతం చేసుకున్నా… పాదయాత్ర తొలిరోజు ప్రకటించుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువగళం ఫస్టాఫ్‌ హిట్‌… సెకండాఫ్‌ ఫ్లాప్‌! ఏ సినిమా అయినా ఫస్టాఫ్‌, సెంకడాఫ్‌ బాగుంటేనే సినిమా విజయవంతం అవుతుంది.