వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు హడావిడి చూస్తుంటే నిజమేనని తేలుతోంది.తెలంగాణలో సైతం ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ క్షణంలో నైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈపాటికి అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చిందని.. అందుకే ఎక్కడికక్కడే రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింట బిజెపి ఘన విజయం సాధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీలున్నంతవరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు పూర్తి చేసి.. షెడ్యూల్ ప్రకటించడానికి ఈసీ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.ఈసారి దేశవ్యాప్తంగా ఎనిమిది విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఐదు దశల్లో పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది. గతసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 10న నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి 20 రోజులు ముందే అంటే.. ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్య నోటిఫికేషన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎం జగన్ సైతం 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది.
పక్క సమాచారం తోనే ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు సమాచారం.మరోవైపు పాలనను పక్కనపెట్టి మరి జగన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక, మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున సిట్టింగులను మార్చుతున్నారు. అటు టిడిపి సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటును ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉంది. ఈ సన్నాహాలు చూస్తుంటే… కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విలువడే పరిస్థితి కనిపిస్తోంది.శీతాకాలం ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడం విశేషం.